-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
-జిల్లా కలెక్టర్ తో ఫోన్లో సమీక్షించిన మంత్రి
-ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు
-గ్రామాల్లో సర్పంచ్ లు చురుకుగా పనిచేయాలి
-ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు
-విపత్తు శాఖ కమీషనర్ కన్నబాబుతో మాట్లాడిన మంత్రి
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
గులాబ్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ తో సమీక్షించారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని సూచనల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ యంత్రాంగం తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస సహాయక చర్యలకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు సలహాలు అందించాలని, పంట నష్టం జరిగితే వెంటనే నివేదికలు రూపొందించే లా ప్రణాళిక ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు, తుఫాను అనంతరం పరిస్థితిని సమీక్షించేందుకు, వెంటనే సహాయం చేసేందుకు సిద్ధంగా ప్రణాళికతో ఉండాలని కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ 08942 240557 ఏర్పాటు చేశామని, రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయం, అన్ని తాసిల్దార్ కార్యాలయాలు కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశామని చెప్పారు.
విపత్తు శాఖ రాష్ట్ర కమీషనర్ కన్నబాబుతో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అవగాహన కల్పించడం చేయాలని కోరారు. అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలని కోరాతు. గత తుఫాను అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రాణ ,ఆస్థి నష్టాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ముందుగా గులాబ్ తుఫాన్ కళింగపట్నం వద్ద తీరం దాటుతుంది అని అనుకున్నప్పటికి తుఫాను దిశ మార్చడంతో ఇచ్చాపురం ప్రాంతం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం వలన పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసి ప్రజలను రక్షించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమీషనర్ కన్నబాబును మంత్రి కోరారు.
పలాస నియోజకవర్గంలో ని వజ్రపుకొత్తూరు మడలం సముద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మందస, పలాస, వజ్రపుకొత్తూరు మూడు మండలాల ప్రజలు, రైతులు తుఫాన్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గులాబ్ తుఫాన్ తీవ్రతరం అవుతున్న కొద్ది వర్షాలు ఎక్కువగా పడతాయని వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పల్లపు ప్రాంతాలలో నీటి ప్రవాహాలు ఏర్పడినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గాలుల తీవ్రత పెరిగి చెట్లు, కరెంటు స్థంబాలు నేలకు వరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని మంత్రి డాక్టర్ అప్పలరాజు ప్రజలను కోరారు. గ్రామాల్లో సర్పంచ్ లు, నాయకులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మంత్రి కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూ. ఎస్, వ్యవసాయ శాఖ, మండల పరిషత్ అధికారులు నిరంతర పర్యవేక్షణలో ఉండాలని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు.