గులాబ్‌ తుపాను, అనంతర పరిస్ధితులపై సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గులాబ్‌ తుపాను, అనంతర పరిస్ధితులపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం  సమీక్షించారు. గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్షించారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీరితోపాటు విజయనగరం నుంచి సమీక్షలో  మంత్రి బొత్స సత్యన్నారాయణ, విశాఖ నుంచి పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి వీసీలో పాల్గొన్న డిప్యూటీసీఎం ధర్మాన  కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు.

తుపాను అనంతర పరిస్థితులను సీఎస్‌ ఆదిత్య నాథ్‌ దాస్‌ వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయన్నారు.  మిగలిన చోట్ల అంత తీవ్రత లేదన్నారు. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి, వాటిని తొలగించామన్నారు. జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదన్నారు. ఆధికారులు అంతా క్షేత్రస్దాయిలో ఉన్నారన్నారు. అవసరతమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశామన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికార్లకు సీఎం నిర్దేశం చేసారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని  అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలన్నారు. ఆమేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలన్నారు. కలెక్టర్లు ఈ మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్‌కు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దన్నారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యతతో కూడి ఉండాలన్నారు. మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక, పునరావాస శిబిరాలను తెరవాలన్నారు. విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఆయా కుటుంబాలకు రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు. తాగునీటి వనరులు వర్షపు నీరు కారణంగా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్‌ ట్యాంకర్లు ద్వారా తాగునీటిని అందించాలన్నారు. జనరేటర్లతో వాటర్‌ స్కీంలు నిర్వహించాలన్నారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలన్నారు. నష్టం అంచనాలు వెంటనే సిద్ధంచేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్యుమరేషన్‌ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున, అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలన్నారు.  వంధార, నాగావళి  నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అవసరమైన చోట వారిని సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నీటిని విడుదలచేయాలన్నారు. మానవతప్పిదాలు ఎక్కడా లేకుండా చూసుకోవాలన్నారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్‌ తుపాను లేదన్నారు. అతిభారీ, భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం నిర్దేశించారు.

క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ సమీక్షా సమావేశానికి పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి (డిజాస్టర్‌ మేనేజిమెంట్‌) వి ఉషారాణి,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, అడిషనల్‌ డీజీ ఏ రవిశంకర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *