-మధ్య కట్టలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన
-ప్రజాభిష్టం మేరకే సురక్షిత ప్రాంతాలకు తరలింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి బుడమేరు కాలువ పొంగటంతో విజయదుర్గా నగర్ మధ్యకట్టలో నీటి మునిగిన ఇళ్లను స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించారు. కాలువ వెంబడి నివసించడం ఎప్పటికైనా ప్రమాదమని ఈ సందర్భంగా నివాసితులకు సూచించారు. ముంపు ప్రాంతంలో నివసించడం వల్ల రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేయడం కష్టమని తెలియజేశారు. నివాసితులు ముందుకొస్తే పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మల్లాది విష్ణు తెలియజేశారు. వార్డు సచివాలయం ద్వారా సర్వే నిర్వహించి ఇప్పటివరకు 207 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి త్వరలోనే వారందరినీ పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతేగానీ బలవంతంగా ఎవరినీ తరలించే ఆలోచన లేదని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. మరోవైపు బుడమేరు కాలువలో తూటికాడ ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో నీటి ప్రవాహం లేక ఇళ్లలోకి నీరు చేరుతోందని.. తక్షణమే తూటికాడను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. త్వరలోనే కాలువకు రక్షణ గోడను సైతం నిర్మిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు డి.దుర్గారావు, ఎస్.రామకృష్ణ, నారాయణరెడ్డి, రాము, ముత్యాలు, ఎస్.దుర్గారావు, ఆర్. రామకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News