మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత ఉండి పింఛను అందుకోలేని ఏ ఒక్కరినీ వదలకుండా కుల, మత, పార్టీలకు అతీతంగా పింఛన్లు అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు.
మంగళవారం ఉదయం వివిధ సమస్యలపై తమ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత మేర కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు.
తనకు గతంలో వృద్ధాప్య పింఛను వచ్చేదని కాని ఇటీవల పింఛను తొలగించారని స్థానిక ఫతుల్లాబాద్ కు చెందిన ఓగంటి సుశీల మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. ఆ విషయమై ఆయన వాకాబు చేయగా ఆమె కొడుకు ఇన్‌కంటాక్స్ పరిధిలో ఉన్నాడని తేలింది. దీనితో ఆయన ఇన్ కంటాక్స్ కట్టేవారి కుటుంబ సభ్యులు పెన్షన్‌కు అర్హులు కారని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిబంధనలు సడలిస్తే తప్పకుండా అవకాశం కల్పిస్తామన్నారు.
32వ వార్డుకు చెందిన సజ్జ మద్దిరాలమ్మ తను వికలాంగురాలననీ, 5 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడని తనకు ఏవిధ మైన పెన్షన్ రావడం లేదని, తనకు పింఛను ఇప్పించవలసిందిగా మంత్రిని కోరింది. దీని విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన ఆమెకు పింఛను ఇప్పించే విధంగా కృషి చేస్తారన్నారు.
పెడనకు చెందిన గుత్తి శ్యామలరావు తాను వృద్దుడినని, కూతురు వివాహం చేసుకొని వెళ్లిపోయిందని, తనను చూసుకొనేవారు ఎవరూ లేరని, తనను వృద్ధాశ్రమంలో చేర్పించాలని మంత్రిని కోరగా ఈడేపల్లిలో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాలని ఆయన తన సిబ్బందికి సూచించారు.
బంటుమిల్లి మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన ఈద ప్రకాశరావు తను పక్షవాతంతో బాధ పడుతున్నానని, తనకు పింఛను ఇప్పించాలని మంత్రిని కోరారు. అందుకు ఆయన దానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని, పింఛను ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News