-చులకన భావం చూపితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టండి…
-సఫాయి కర్మచారులకు జాతీయ కమీషన్ ఛైర్మన్ యం వెంకటేశన్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సఫాయి కర్మచారుల పట్ల చులకన భావంతో ప్రవర్తించే ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ ఛైర్మన్ ఎం. వెంకటేశన్ కోరారు.
బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సఫాయి కర్మచారుల సమస్యలు, తెలుసుకుని పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించారు. ముందుగా కెఎల్‌రావు నగర్ మున్సిపల్ కాలనీ లో నివసిస్తున్న సఫాయి కర్మచారులతో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ తో కలిసి కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత నేరుగా సమావేశానికి వచ్చారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఎం. వెంకటేశన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను మేల్కొలిపేందుకు రాజ్యాంగబద్ధంగా తమ వ్యవస్ధ పనిచేస్తోందన్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న అందరికి ప్రత్యేక హక్కులు ఉంటాయన్నారు. తన తల్లిదండ్రులకు కూడా సఫాయి కర్మచారులేనని, ప్రతీ ఒక్కరి సమస్య తనకి తెలుసునన్నారు. అయితే వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే తాను వచ్చానన్నారు.
-కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన కూలీలకు జీతాలు పెంచాలని, ఎరియర్స్ డబ్బులు కూడా అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఒక సఫాయి కర్మచారిని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసింది. అందుకు అలాగే బోనస్ కూడా మంజూరు చేయాలని కోరింది. ఛైర్మన్ వెంకటేశన్ స్పందిస్తూ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కర్మచారులు కష్టపడి తమ ప్రాణాలకు లెక్క చేయకుండా పని చేశారన్నారు. వేరే రాష్ట్రాలు నెలకు 5000 రూపాలయల చొప్పున ప్రత్యేకంగా 15 వేల రూపాయలు కార్మికులకు ఇచ్చారని, అదే రీతితో రాష్ట్రంలో కూడా ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
-ప్రతీ వారంలో గురు, ఆదివారం అర్థరోజు వియంసిలో సెలవు ఇస్తున్నారని కానీ ఆదివారం ఒక రోజే పూర్తి రోజు సెలవు ఇవ్వాలని మరో సఫాయి కర్మచారిని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్ జోక్యం చేసుకుంటు ఒక్క రోజు నగరంలో చెత్త తీయకపోతే పరిస్థితిని ఉహించవచ్చాని ప్రజలు, పిల్లలు జబ్బులు పాలవుతారని చెప్పారు. చైర్మన్ వెంకటేశన్ మాట్లాడుతూ కమిషనర్ వాస్తవం చెబుతున్నారని ఒక రోజు పరిశుభ్రం చేయకపోతే ప్రజల పరిస్థితి దుర్లభమవుతుందన్నారు. అందుకే రెండు అర్థ రోజులు సెలవు ఇచ్చారన్నారు.
-సవిశెట్టి బుజ్జి అనే కర్మచారిని మాట్లాడుతూ వియంసిలో సరైన తోపుడు బళ్ళులేవని, పిఎఫ్ కోసం తిరుగుతున్నా, మూడు నెలలుగా జీతాలు, 13 నెలలుగా ఏరియర్స్ కూడా అందలేదని ఆధార్ కార్డులో పేరు తప్పుగా పడిరదని కారణాలు చూపుతున్నారని సమావేశ దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రత్యేక ఆర్జీ ఇవ్వమని వెంకటేశన్ కోరుతూ సమస్యను వెంటనే పరిష్కరించమని కమిషనర్ ప్రసన్న వెంకటేషన్‌ను ఆదేశించారు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులకు, జీతం సర్టిఫికెట్లతో పాటు పిఎఫ్ మొత్తం కూడా జమ అయిన విషయాన్ని వారి ఫోన్‌లకు సమాచారం ఇస్తామని కమిషనర్ ప్రకటించారు. అలాగే రిటైర్డ్ అయిన కార్మికుల పెన్షన్ బెనిఫిట్స్ అన్ని కార్యాలయంలో పూర్తి అయ్యాయని చెప్పారు. అలాగే కొద్ది రోజుల్లోనే ఆ మొత్తం కూడా వారి ఖాతాలకు చేరుతుందన్నారు.
-తిరువూరులో తన బంధువులకు బాగోలేదని వెళుతుంటే ప్రమాదం జరిగిందని, చేతికి ఇనపకడ్డి వేశారని, మూడు నెలల పాటు తాను పనికి వెళ్లలేకపోయానని మరోక కర్మచారి తన బాధను వెల్లగక్కారు. తాత్కాలిక ఉద్యోగి అయినందు వల్ల సెలవు దినాలకు జీతం రాదని కమిషనర్ చెప్పారు. అయితే ప్రధాన మంత్రి జీవిత బీమాలో చేరార అని ఛైర్మన్ ఆరా తీశారు. తాను చేరలేదని విని, కార్మికులంతా బీమా పథకంలో 12 రూపాయలు కట్టి చేరమని కోరారు. అలాగే మరో 330 రూపాయలు చెల్లించి యాక్సిడెంట్ పాలసీ చెరితే ప్రమాదం జరిగినపుడు లక్ష రూపాయలు, మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు బీమా మొత్తం అందుతుంన్నారు. అలాగే ఆయూష్మాన్ పథకంలో ప్రతీ కర్మచారి చేరి ఆరోగ్య కార్డులు పొందాలని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తోందని దానికిందే ఆయనకు వైద్యం కూడా అందిస్తోందని సంతోషించారు. మాస్కులు, బూట్లు, గ్లాజులు, రేడియం జాకెట్లు క్రమ పద్దతిలో ఇవ్వండిని కమిషర్‌ను కోరారు.
-మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న దుర్గభవాని మాట్లాడుతూ తనకు జీతం తక్కువగా ఇస్తున్నారని పిఎఫ్‌కూడా సరిగ్గా కంట్రాక్టర్ కట్టడం లేదని ఆరోపించారు.
-నూజివీడు త్రిబుల్‌ఐటిలో పనిచేస్తూన్న 125 మంది ఉద్యోగులను హౌస్‌కీపర్‌లుగానే చూస్తున్నారే తప్ప సఫాయి కర్మచారిలతో సమానంగా జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు.
-పాయకపురం నుంచి వస్తున్న సౌజన్య అనే తనకు దగ్గరగా పని ఇప్పించాలని కోరింది.వీరి సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ వియంసి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ వీలైనంత వరకు పారిశుద్ధ్యంలో యంత్రాలనే వాడుతున్నామని చెప్పారు. ఇపిఎఫ్‌లు, ఇఎస్‌ఐలు కడుతున్నారని చెప్పారు.
జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత మాట్లాడతూ ఇంటి స్థలం లేని వారి ధరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే స్థలం చూపిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో కార్మికులు పారిశుద్ధ్య పనులను చాలా బాగా చేశారన్నారు. 1388 మంది గుంటలో దిగి పనిచేస్తున్న వారిని పునరావాసం కూడా కల్పించి ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
ఈ సమావేశంలో జెసి, ఆసరా కె.మోహన్‌కుమార్, డిడి సోషల్ వెల్ఫెర్ సరస్వతి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి చంద్రలీల, వీయంసి సిఇ ఎం. ప్రభాకర్‌రావు, సియంఓ హెచ్ డాక్టర్ గీతాబాయి, యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News