-అక్టోబరు 10 కల్లా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయం
-పేపర్ మిల్స్,వ్యాపారులు,రైతు సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించి, వారి ఉత్పత్తులకు పేపర్ మిల్స్ నుండి తగిన మద్దతు ధర అందే విధంగా తగు విధి, విధానాలను రూపొందించి అక్టోబరు 10 లోపు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని మంత్రి వర్గ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ సబ్ కమిటీ సభ్యులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు (నాని), బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు గురువారం అమరావతి సచివాలయంలో అధికారులు, పేపర్ మిల్స్, వ్యాపారులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారంపై సుదీర్ఝంగా చర్చలు జరిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుబాబుల్, యూకలిఫ్టస్ సాగు చేసే రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసం సంబంధిత పేపర్ మిల్స్ ప్రతినిధులు, వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రుల బృంధం కోరింది. వ్యాపారుల ప్రమేయంతో రైతులకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, వారి ప్రమేయం లేకుండా తగు మద్దతు ధరను పేపర్ మిల్స్ నుండే నేరుగా రైతుల ఖాతాలకు జమ అయ్యే విషయాన్ని పరిశీలించాలన్నారు. సుబాబుల్, యూకలిప్టస్ సాగుచేసే పెద్ద రైతులు మరియు చిన్న, సన్నకారు రైతుల మద్య ఎటు వంటి వ్యత్యాసాన్ని చూపకుండా సమానంగా కటింగ్ ఆర్డర్ జారీ చేసే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రుల బృంధం సూచించింది. రైతులకు మద్దతు ధరతో పాటు లాభదాయకమైన పరిస్థితులు కల్పించేలా ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలని, ట్రేడర్లను నియంత్రించేలా పలు చర్యలను తీసుకోవాలని, ట్రేడర్లకు లైసెన్సింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రుల బృంధం అధికారులకు సూచించింది. కనీస మద్దతు ధర ప్రకటించే విషయంలో పేపర్ మిల్స్ కు కొన్ని రోజుల కాల వ్యవధి ఇస్తున్నట్లు, ఈ లోపు సంబందిత యాజమాన్యాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రతినిధులకు మంత్రుల బృంధం సూచించింది. త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించిన తదుపరి సుబాబుల్ రైతులకు న్యాయం జరిగేలా విధి, విదానాలను రూపొందించే విషయంపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రుల బృంధం నిర్ణయించింది.
వ్యవసాయ వుత్పత్తుల సేకరణ, ధరలను నిరంతరం పర్యవేక్షించేందుకు రూపొందించిన ప్రత్యేక ఆప్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న మంత్రుల బృంధానికి వివరించారు.
వ్యయసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాల కొండయ్య, మార్కెటింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ మధుసూదన రెడ్డి, రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్స్, భద్రాలచలం ఐ.టి.సి. కంపెనీ, మహారాష్ట్ర బల్లార్పూర్ కు చెందిన బి.ఐ.ఎల్.టి. కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News