
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్ డివిజన్ల పరిధిలోకి వచ్చే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించింది. విజయవాడ సత్యనారాయణపురంలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీటీసీ)లో నేడు అనగా 30 సెప్టెంబర్ 2021 తేదీన నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 15 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు విజయవాడ, గుంటూరు, గుంతకల్ మరియు హైదరాబాద్ డివిజన్లకు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశానికి హాజరయిన ప్రతినిధులకు సాదరంగా స్వాగతం పలికిన గజానన్ మాల్య దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రదర్శించిన పనితీరు మరియు జోన్‌లో ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధి కోసం చేపట్టిన వివిధ చర్యలను వారికి తెలియజేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి ప్రారంభమయ్యే100% మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు మరియు 1/3 వంతుకు పైగా ప్యాసింజర్ సర్వీసులను కూడా నడుపుతున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. గుంటూరు` గుంతకల్ మధ్య డబ్లింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని, విజయవాడ`భీమవరం, గుడివాడ`మచిలీపట్నం విద్యుదీకరణతో సహా డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, నిడదవోలు`నర్సాపూర్ మధ్య డబ్లింగ్ మరియు విద్యుదీకరణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. విజయవాడ`గూడూరులో మూడవ లైను పనులు 30 కిమీ మేర పూర్తయినట్లు, మరో 60 కిమీ మేర పనులు పురోగతిలో ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. జోన్‌లో నిర్వహించిన కొన్ని స్టేషన్ల అభివృద్ధి పనులను కూడా ఆయన సమావేశంలో తెలియజేశారు.
దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న వివిధ రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను పార్లమెంట్ సభ్యులు సమావేశంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా వారివారి నియోజకవర్గాలలో చేపట్టవలసిన పలు రైల్వే అభివృద్ధి పనులను/సేవలను గురించి వారు ప్రస్తావించారు. నూతన రైల్వే లైన్ల నిర్మాణం, నూతన రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రస్తుత రైళ్ల సర్వీసులను పొడగించడం, రైళ్లకు అదనపు స్టాపేజీలు, రోడ్ ఓవర్ బ్రిడ్జీలు/రోడ్ అండర్ బ్రిడ్జీల నిర్మాణాలు మరియు ప్రయాణికులకు వసతులను కల్పించడం వంటి పలు అంశాలను సభ్యులు సమావేశంలో లేవనెత్తారు.
ఈ సమావేశంలో చర్చించిన పలు అంశాలు ఈ ప్రాంతంలోని ప్రజల కోసం రైల్వే అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంలో ఎంతో తోడ్పడుతాయని జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుల పలు సూచనలు మరియు వారి అభిప్రాయాలను జోన్‌లో నూతన పనులు/సర్వీసుల ప్రతిపాదనలు రూపొందించే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఆయన తెలియజేశారు.
ఈ సమావేశానికి హాజరయిన పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, అమలాపురం, డా॥బీశెట్టి వెంకట సత్యవతి, అనకాపల్లి, తలారి రంగయ్య, అనంతపురం, ఎన్.రెడ్డప్ప, చిత్తూరు, కురువ గోరంట్ల మాధవ్, హిందూపూర్, వంగ గీత విశ్వనాథ్, కాకినాడ, డా॥ సింగారి సంజీవ్ కుమార్, కర్నూలు, పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నర్సరావుపేట, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, మార్గాని భరత్, రాజమండ్రి, కనకమేడల రవీంద్ర కుమార్ (రాజ్యసభ), ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (రాజ్యసభ), పిల్లి సుభాష్ చంద్రబోస్(రాజ్యసభ).
Prajavartha Online Telugu News