– పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన
– మైనింగ్ రంగంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలు అవసరం
– మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి బెదిరింపులు సిగ్గుచేటు
– పుట్టిన రోజు పేరుతో రాక్షసుల్లా రక్తాభిషేకాలు దారుణం
– 11 సీట్లతో ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు
– ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించబోమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే జగన్ రెడ్డిని ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం తధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇంకా బుద్ధి మారలేదు. పుట్టిన రోజు పేరుతో రాక్షసుల్లా మూగ జీవాలను చంపి రక్తాభిషేకాలు చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి లాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అరాచక శక్తుల్లా వ్యవహరిస్తున్న కేడర్‌ను వారించాల్సింది పోయి ప్రోత్సహించడం జగన్ రెడ్డి ఆలోచనలకు నిదర్శనం.
వైసీపీ పాలనలో రాష్ట్ర మైనింగ్ రంగాన్ని జగన్ రెడ్డి నాశనం చేశాడు. లీజు దారుల్ని బెదిరించి, భయపెట్టి, తప్పుడు కేసులు పెట్టి, భారీ పెనాల్టీలతో వేధింపులకు గురి చేశాడు. ఇసుక దోచుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పాలసీతో భవన నిర్మాణదారులకు అండగా నిలిచాం. మైనింగ్ రంగాన్ని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మైనింగ్ రంగంలో వేల్యూ యాడెద్ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముడిసరుకును మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయం సమకూరుతుంది.
మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి వైఖరి దుర్మార్గం. ప్రపంచం మొత్తం ఆమోదించి, అనుసరిస్తున్న పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి ఆస్తి కల్పించేలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. ఆస్పత్రుల నిర్మాణానికి ముందుకొచ్చే వారిని బెదిరించడం సిగ్గుచేటు. కాలేజీ నిర్మాణాలు తానే చేపట్టానని చెబుతున్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కేంద్రం నుండి వచ్చిన నిధుల్ని కూడా పక్కదారి పట్టించాడు. కాలేజీలు పూర్తి చేయాలంటే రూ.7-8 వేల కోట్లు ఖర్చు చేయాలి. ప్రజలకు ఉచితంగా విద్య వైద్యం అందిస్తుంటే కుట్రలు చేస్తే సహించేది లేదు. జగన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై కుట్రలు చేస్తే ప్రజలే రాజకీయంగా సమాధి చేస్తారని హెచ్చరించారు.
దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ రెడ్డికి ఏం తెలుసు? తాను నివాసం ఉండడం కోసం రూ.400 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నాడు. దాని గురించి ప్రశ్నిస్తే యోగా డేకు ముడిపెడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కేటాయించిన నిధులతో చేపట్టిన కార్యక్రమానికి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన రుషికొండకు ముడిపెట్టడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం. కేంద్ర నిధులకు రాష్ట్ర నిధులకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశాడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది.
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 26 పాలసీలను తీసుకొచ్చాం. విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని ఏపీకి రప్పించాం. పోలవరం, అమరావతి పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్రుల హక్కుగా నిలిచే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నాం. అర్సెల్ మిట్టల్ లాంటి మరో పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం చేస్తుంటే.. జగన్ రెడ్డి కుట్రలు హేయం.
జగన్ రెడ్డి అనైతికంగా, అస్తవ్యస్తంగా జిల్లాలను విభజించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల పునర్విభజన చేపట్టాం. మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి.. ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. ఆమేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. గిరిజనులకు పాలనా ఫలాలు సక్రమంగా అందించడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు జిల్లాలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని సర్వముఖోభివృద్ధి లక్ష్యంగా 28 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం.
2025లో ప్రజలు ఆశించిన మేరకు పాలన అందించాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. నూతన సంవత్సర వేడుకలను సైతం పక్కన పెట్టి ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. నిరంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పాలకులపై విమర్శలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Prajavartha Online Telugu News