విద్యుత్తు ఉద్యోగులు గర్వించేలా చేశారు!

-జగత్ సాయి, వసంత్ అరుదైన ఘనత సాధించారు
-ఏఈ కుమారులిద్దరికీ సివిల్స్ లో అత్యుత్తమ ర్యాంకులు
-ఒకే కుటుంబంలో 32, 170 ర్యాంకులు సాధించడం అద్భుతం
-నాకు తెలిసి రాష్ట్రంలో ఇదే తొలిసారి : శ్రీకాంత్
-ర్యాంకర్లను సన్మానించిన ఇంధన శాఖ కార్యదర్శి

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
జగత్ సాయి, వసంత్.. విద్యుత్తు శాఖ ఏఈ కుమారులైన వీరిద్దరూ అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే అత్యున్నతమైన యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. వారి కుటుంబాన్నేగాక ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలనూ ఆనందడోలికల్లో తేలియాడేలా చేశారు. ఏపీఈపీడీసీఎల్ లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా పనిచేస్తున్న ఆర్. భీమేశ్వరరావు కుమారులైన జగత్ సాయి, వసంత్.. సివిల్స్ లో 32, 170 ర్యాంకులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వీరిద్దరూ విద్యుత్తు సంస్థలకు చెందిన ప్రతి ఒక్క ఉద్యోగీ గర్వపడేలా చేశారు.
విద్యుత్తు సౌధలో నిర్వహించిన కార్యక్రమంలో జగత్ సాయి, వసంత్ ను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సత్కరించారు. ఏఈ భీమేశ్వరరావు కుటుంబం మొత్తాన్ని సన్మానించారు. సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. జగత్ సాయి, వసంత్ సోదరులు మొత్తం విద్యుత్తు రంగ ఉద్యోగులకే స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. విద్యుత్తు రంగం కేవలం వినియోగదారులేగాక ఉద్యోగుల హితాన్నీ కోరుతుందన్నారు. పిల్లల వికాసంలో తల్లిదండ్రుల ప్రవర్తనే కీలక పాత్ర పోషిస్తుందని శ్రీకాంత్ చెప్పారు. వారు సక్రమంగా ఉంటేనే పిల్లలూ సరైన మార్గంలో పయనిస్తారన్నారు. సివిల్స్ లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ర్యాంకులు రావడం తనకు తెలిసి ఇదే తొలిసారి అని చెప్పారు.
ఇలాంటి అద్భుతమైన, అరుదైన ఘనత సాధించేలా పిల్లలను ప్రోత్సహించడం సాధారణ విషయం కాదని శ్రీకాంత్ అన్నారు. తమ పిల్లలు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని, వాటిని సాధించేలా విద్యుత్తు రంగ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. విద్యుత్తు ఉద్యోగుల పిల్లలు మరిన్ని ర్యాంకులు సాధించాలని, కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్తు రంగ ప్రతిష్ఠ పెరుగుతోందని శ్రీకాంత్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా జోక్యం చేసుకోవడంతో పాటు సంపూర్ణ సహకారం అందిస్తుండడం, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తుండడంతో విద్యుత్తు రంగ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నట్లు తెలిపారు. విద్యుత్తు రంగం పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2300 కోట్లు ఆదా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ మన్ననలు అందుకున్నట్లు తెలిపారు. విద్యుత్తు సంస్థల అద్భుత పనితీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ సంపూర్ణ సహాయ సహకారాలను అందించేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
ఏఈ భీమేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యుత్తు శాఖ తననెంతగానో ప్రోత్సహించిందన్నారు. విద్యుత్తు శాఖ తనను బాగా చూసుకోవడం వల్లే తాను కుటుంబాన్ని బాగా చూసుకోగలిగినట్లు చెప్పారు. విద్యుత్తు శాఖకు తానెంతో రుణపడి ఉన్నానన్నారు. శాఖ చేయూత లేకపోతే ఈ రోజు తన కుమారులు ఈ ఘనత సాధించేవారే కాదని చెప్పారు.
కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథ రావు , జె.పద్మజనార్దన్ రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ కె.ప్రవీణ్ కుమార్, సీఈలు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొని ఉత్తమ ర్యాంకులు సాధించిన ఏఈ కుమారులను అభినందించారు.
జగత్ సాయి, వసంత్ మాట్లాడుతూ.. విద్యుత్తు శాఖలో తమ తండ్రి చేస్తున్న సేవలే తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ప్రభావం తమపై ఎంతగానో ఉందన్నారు. ఏపీ విద్యుత్తు రంగంలో తమ తండ్రి పనిచేస్తుండడం తమకెంతో గర్వంగా ఉందని తెలిపారు. చిన్ననాటి నుంచే ఆయన తమనెంతో ప్రోత్సహించేవారని చెప్పారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *