మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో కోవిడ్-19 ఎక్స్ ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రారంభించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో ఆయన జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత, బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి మరియు ఇతర వైద్యాధికారులతో కలసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రెండు మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను కేటాయించిందని తెలిపారు. ఈ వాహనంలో అన్ని సదుపాయాలతో పాటు నిపుణులైన ఎఎన్ఎంలు ఉంటారని, ఈ ప్రక్రియ ముందుగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మురికివాడలు, కొండ ప్రాంతాలు కలిగిన ప్రదేశాలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో ఉన్నచోటనే ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, క్రమంగా వ్యాక్సిన్ చేరడానికి అందుబాటులో లేని నగర, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News