Breaking News

అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకాలకు దూరం కాకూడదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-వార్డు సచివాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సిబ్బంది జవాబుదారీతనంగా వ్యవహరించాలి
-ఈబీసీ నేస్తానికి గడువులోగా అర్హులచే దరఖాస్తులు చేయించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కులమతాలకతీతంగా శాచ్యురేషన్ పద్థతిలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. సత్యనారాయణపురం, ముత్యాలంపాడులోని వార్డు సచివాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. మరీముఖ్యంగా ఈబీసీ నేస్తం పథకానికి అర్హులైన ప్రతిఒక్కరి చేత రేపటిలోగా దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎక్కడా తాత్సారం జరగకూడదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అమలు కానున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు చివరి గడప వరకు చేరాలంటే.. అన్ని శాఖల సమన్వయం ప్రధానమని తెలిపారు.

అనంతరం మల్లాది విష్ణు  మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు సచివాలయాల సందర్శన ద్వారా అందరిలోనూ బాధ్యత మరింత పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. గడపగడపకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటైన వార్డు సచివాలయ వ్యవస్థ లక్ష సాధన కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 1,344 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని.. వీరంతా సచివాలయ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా పనిచేయాలన్నారు. స్థానిక కార్పొరేటర్లకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మరోవైపు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని.. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను వివరించాలని సూచించారు. ఏయే నెలలలో, ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను క్లుప్తంగా తెలియజేయ‌డం, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సిబ్బంది ఫోన్ నెంబర్లను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఏదిఏమైనా నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదని మల్లాది విష్ణు గారు మరోసారి స్పష్టం చేశారు. ఎవరి దరఖాస్తునైనా తిరస్కరిస్తే తగిన కారణం చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఆయా డివిజన్ల కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, పెనుమత్స శిరీష సత్యం, సచివాలయ సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గన్నవరం వ్యాక్సిన్‌ కోల్డ్‌చైన్‌ అధికారి దేవానందం సస్పెన్షన్‌

-మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యల ఫలితం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం స్టేట్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌లో కోల్డ్‌చైన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *