-రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా తగినంతగా లేకపోయినా ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్తును అందిస్తున్నాం…
-బొగ్గుకొరతవల్ల ఏర్పడిన ఈసంక్షోభంలో కూడా రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా అందిస్తున్నాం …
-రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం విద్యుత్తు వినియోగం పెరిగింది…
-ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లింవలసిన విద్యుత్తు సబ్సిడీ సెప్టెంబరు వరకూ చెల్లించాం…
-ఏపి ట్రాన్స్ కో సియండి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా తగినంతగా లేకపోయినా, విద్యుత్తు అంతరాయం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపి ట్రాన్స్ కో సియండి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి అన్నారు.
విజయవాడలోని ఆర్ అండ్ బి భవనంలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ పై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి వివరించారు.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా బొగ్గుకొరత ఉందని ఏపి జెన్ కోకు రావాల్సిన ర్యాక్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ధర్మల్ ప్లాంట్లకు 70 వేల మెట్రిక్ టన్నులు బొగ్గు అవసరమని, ప్రస్తుతం ఉన్న ఏ ధర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో కూడా 100 శాతం ఉత్పత్తి జరగడం లేదని దీనికి బొగ్గుకొరతే కారణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 195 మిలియన్ యూనిట్లు కాగా గత సంవత్సరంలో పోలిస్తే ఈ నెల వరకూ 20 శాతం మేర విద్యుత్తు వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. ఏపి జెన్ కో ద్వారా 40 మిలియన్ల యూనిట్లు, కేంద్ర ప్లాంట్ల నుంచి 35 మిలియన్ల యూనిట్లు, జలవిద్యుత్తు కేంద్రాల నుండి 25 మిలియన్ల యూనిట్లు, సోలార్ విద్యుత్తు ప్లాంట్ల నుండి 15 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతుందని శ్రీకాంత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు పాలసీ ప్రకారం సౌర, పవన విద్యుత్తు సరఫరాను ప్రోత్సహిస్తున్నామని అందువలన గత రెండేళ్లుగా బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. అన్ని ధర్మల్ విద్యుత్తు ప్లాంట్లు దేశీయ బొగ్గుపై ఆధారపడి నిర్వహిస్తున్నామని, విజయవాడ, ఆర్టిపి ధర్మల్ కేంద్రాలకు సింగరేణి బొగ్గుగనులు నుండి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని బొగ్గుగనుల నుండి ఇంతవరకూ బొగ్గు సరఫరా అయ్యేదని ఆయన అన్నారు. దేశంలో ఏర్పడిన బొగ్గుకొరత కారణంగా మనరాష్ట్రంలోని ధర్మల్ విద్యుత్తు కేంద్రాలతో పాటు దేశంలో మొత్తం 135 ధర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఉండగా వాటిలో 75 శాతం కేంద్రాలలో 4 రోజులకు అవసరమయ్యే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గురేట్లు రెండు నుండి మూడు రెట్లుకు పెరిగాయని దేశీయ బొగ్గుగనులపై మాత్రమే ఆధారపడడంతో ఇటువంటి ఒత్తిడి వచ్చిందని ఆయన అన్నారు. మన దేశ విద్యుత్తు అవసరాల్లో సుమారు 60 శాతం వరకూ బొగ్గు ఆధారిత విద్యుత్తు పైనే మనం ఆధారపడుతున్నామన్నారు. మన దేశానికి ఇండోనేషియా నుంచి ఎక్కువుగా బొగ్గు సరఫరా జరుగుతున్నదని ఏప్రిల్ నెలలో టన్ను బొగ్గు 86.68 డాలర్లకు సరఫరా చేయగా అది ఇప్పుడు 162 డాలర్లకు పెరిగిందని ఈప్రభావం సహజంగానే మనరాష్ట్రం పై కూడా తీవ్రంగా పడుతుందని శ్రీకాంత్ నాగులపల్లి అన్నారు. ఈపరిస్థితులన్నింటి పై కేంద్రానికి లేఖ వ్రాస్తున్నామని కార్యదర్శి అన్నారు. రాష్ట్రంలోని ధర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో 100 శాతం ఉత్పత్తి జరుగుటలేదని బొగ్గు సరఫరా లేకపోవడం వలన బహిరంగ మార్కెట్ నుండి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామన్నారు. గత నెల 16వ తేదీన యూనిట్‌కు రూ. 4.40 పైసలు ఉంటే ఆగష్టు 7వ తేదీ నాటికి రూ. 15 లకు చేరిందన్నారు. ఇటువంటి పిక్ డిమాండ్ ఉన్న సమయంలో అధిక రేట్లు పెట్టి విద్యుత్తును కొనుగోలు చేసి విద్యుత్తు అంతరాయం లేకుండా ప్రజలకు అందిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు. గృహ వినియోగదారులు పిక్ డిమాండ్ సమయంలో ఏసి లోడ్ ను తగ్గిస్తే 10 మిలియన్ యూనిట్లు ఆదా అవుతుందని నాగులపల్లి శ్రీకాంత్ అన్నారు.
విద్యుత్తు సంస్థలను ఆదుకోవడానికి గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం చేయగలిగిందంతా చేసిందని దాదాపు రూ. 34 వేల 340 కోట్లు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుందన్నారు. కేవలం కృష్ణపట్నం విద్యుత్తు ప్లాంటుకే రూ. 9165 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. మార్చి 2019 నాటికి రూ. 27239 కోట్లు ఉన్న విద్యుత్తు సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ. 27552 కోట్ల వద్దే నిలువరించడం జరిగిందని శ్రీకాంత్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించవలసిన విద్యుత్తు సబ్సిడీ సెప్టెంబరు వరకూ చెల్లించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ విద్యుత్తు వినియోగదారుడు విద్యుత్తు పొదుపుపై శ్రద్ధ వహించాలని శీతాకాలం అయినందున ప్రతీ వ్యక్తి విద్యుత్తు పొదుపు పాటించాలన్నారు. బొగ్గు కొరత వలన ఏర్పడిన ఈసంక్షోభంలో కూడా మన విద్యుత్తు ఉత్పత్తి పంపిణీ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్తు సంస్థలు మనందరివీ, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి అన్నారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ డిప్యూటి సెక్రటరీ పృధ్వీతేజ్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News