తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఖండిస్తూ నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమం అనంతరం, ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పలు కీలక అంశాలు వెల్లడించారు.
డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్‌డీడీబీ మరియు సిట్ నివేదికలు స్పష్టంగా నిర్ధారించాయని తెలిపారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన శ్రీవారి నైవేద్యం పవిత్రతను దెబ్బతీసే ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాకుండా భక్తుల ఆత్మగౌరవాన్ని అవమానపరిచే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి కూటమి నాయకులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు, భక్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. హరే రామ హరే కృష్ణ టెంపుల్ నుండి అలిపిరి పాదాల వరకు నడుచుకుంటూ వెళ్లి, అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని ప్రార్థించామని చెప్పారు. కల్తీ నెయ్యికి పాల్పడిన వారికి తగిన శిక్ష విధించాలని, వారికి మంచి బుద్ధి కలగాలని మొక్కుకున్నామని పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి జరిగిందని ఒకవైపు అంగీకార వ్యాఖ్యలు వస్తుండగా, మరోవైపు జరగలేదని చెప్పడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు. లడ్డూల తయారీకి సంబంధించి వివిధ ప్రాంతాల నుండి నెయ్యి సరఫరా చేసిన విషయాన్ని కొందరు నేతలు స్వయంగా వెల్లడించారని గుర్తు చేస్తూ — మిగిలిన లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిపై అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర విచారణ అవసరమని స్పష్టం చేశారు. పదే పదే అబద్ధాలు చెబితే అవే నిజమవుతాయనే విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఈ ఘటనపై బాధ్యులు నిజం ఒప్పుకుని హిందువులకు, ముఖ్యంగా శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, జనసేన నిర్వహించిన శాంతియుత ర్యాలీ మరియు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ, సాక్షి పత్రిక వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశాయని తీవ్రంగా ఆక్షేపించారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరగడం బాధాకరమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసిన సాక్షి సంస్థలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. శ్రీవారి నైవేద్యం పవిత్రతను కాపాడే ఈ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని డా. పసుపులేటి హరిప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News