అత్యంత భక్తి శ్రద్ధలతో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు

-ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరంలోని స్థానిక పందిరి ఫంక్షన్ హాల్‌లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు కలెక్టర్ కీర్తి చేకూరి కలిసి ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున హాజరై ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలిపారు. మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు నిర్వహించడం అభినందనీయమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులపై అల్లా కృప ఉండాలని ఆకాంక్షించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల సంరక్షణతో పాటు మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తున్నట్లు, అదే విధంగా తమ ట్రస్టు ద్వారా పలు కార్యక్రమాలను అంద చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమనిష్ఠలకు ప్రతీక అని తెలిపారు. ఉపవాస దీక్షల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సామరస్యాలతో ప్రార్థనలు నిర్వహించడం సమాజానికి మంచి సందేశమన్నారు. జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

వై. మేఘా స్వరూప్, జాయింట్ కలెక్టర్, తమ సందేశంలో రంజాన్ మాసం ఆత్మపరిశుద్ధి, దైవభక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉపవాసం మనలో నియమనిష్ఠలను పెంపొందించి సేవాభావాన్ని పెంచుతుందన్నారు. పరస్పర గౌరవం, ప్రేమ, దాతృత్వం వంటి మానవ విలువలను బలపరిచే ఈ పవిత్ర మాసాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఐక్యత, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం సౌభ్రాతృత్వం, సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. ఇఫ్తార్ విందులు పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొంటూ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ ఎల్ చెంచు రెడ్డి, ఇంచార్జి ఆర్డీవో కె భాస్కర్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అఫ్సరి,
మైనార్టీ మత పెద్దలు మహమ్మద్ అబ్దుల్లా, మహమూద్ జానీ, భాషా నిమ్రా, రెఫిక్ రాజా, షేక్ బషీర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, ముస్లిం సోదర సోదరీమణులు, పలు శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *