విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగు,పంటకు మద్దతు ధర కలిపించే విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఖరీఫ్ లో పంటల సాగు,కొనుగోలుకు కార్యాచరణ,రబీ కు సంసిద్ధత తదితర అంశాలపై జిల్లా వ్యవసాయ సలహా బోర్డు సమావేశం శనివారం వర్చ్యువల్ విధానంలో జరిగింది. సమావేశంలో బోర్డు చైర్ పర్సన్ జన్ను రాఘవరావు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె.మాధవీలత, వ్యవసాయశాఖాధికారులు వర్చ్యువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం,రబీ సంసిద్ధత తదితర అంశాలను తెలియజేయాలన్నారు.
బోర్డు చైర్ పర్సన్ జన్ను రాఘవరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ పంట సాగు అనంతరం ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట కొనుగోలుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అనుబంధాల రంగాలైన ఉద్యానవనాలు, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమలకు చెందిన రైతుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు సాగుకు అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నామన్నారు. మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందుల వినియోగిస్తే వచ్చే దుష్ప్రభావాలపై రైతులకు అవగాహనా కలిగిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో పొలం బడి కార్యక్రమాలు నిర్వహించి సాగులో వ్యయ నియంత్రణ, ఉత్తమ యాజమాన్య పద్ధతులు , వ్యవసాయ శాస్త్రజ్ఞులు అందించే సాంకేతిక సలహాలను అందిస్తున్నామన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంతున్నామన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ తల్లూరు మోహనరావు, అసిస్టెంట్ డైరెక్టర్ మణిధర్ , జిల్లా వ్యవసాయ సలహా బోర్డు సభ్యులు, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News