Breaking News

గోదావరి పుష్కరాల నాటికి భక్తుల కోసం ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టేలు’ సిద్ధం కావాలి: మంత్రి కందుల దుర్గేష్

-రాజమహేంద్రవరం టూరిజం హబ్, ఏపీటీడీసీ కాకినాడ డివిజన్ అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష – అధికారులకు కీలక ఆదేశాలు జారీ
-కేరళను మించి ఏపీ పర్యాటకం..’హోమ్ స్టే’లతో సామాన్యులకు ఉపాధి కల్పించాలని వెల్లడి!
పుష్కరాల వేళ ఆధ్యాత్మిక పర్యాటకం..సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో పుష్కర భక్తుల కోసం 21 ప్రధాన దేవాలయాల్లో టెంట్ సిటీలు ..భక్తులకు రాజమర్యాదలు అందేలా పక్కా ప్లాన్
-మీ ఇంట్లో గది ఉందా? అయితే అది ‘హోమ్ స్టే’.. పర్యాటక రంగంలో ప్రజల భాగస్వామ్యానికి పిలుపు!
-జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక లక్ష్యంగా’గోదావరి టూరిజం సర్క్యూట్’
-వైజాగ్ టూ అరకు కారవాన్ టూరిజం సక్సెస్.. త్వరలో గోదావరి జిల్లాల్లోనూ అమలు
-పర్యాటక ప్రాజెక్టులకు క్లియరెన్స్ లీడర్ గా ఏపీ – ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేష్ భరోసా
-కాకినాడ, పేరుపాలెం బీచ్ ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ – బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దిశగా అడుగులు వేయాలని అధికారులకు ఆదేశాలు
-పర్యాటక ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసినా, నిర్వహణ సరిగ్గా లేకపోయినా నోటీసులు ఇచ్చి, అవసరమైతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసి కొత్త వారికి అప్పగించాలని మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ
-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్‌తో పర్యాటక ప్రగతి.. టూరిజంలో ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్.. అనుమతుల మంజూరులో ఏపీ స్పీడ్!
-“ఏపీ అందాలు కేరళకు తీసిపోవు – ప్రచారమే మన ఆయుధం.”:మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“కేరళ కంటే మెరుగైన ప్రాకృతిక సంపద మనకుంది. కొంచెం ప్రచారం.. మరికొంత పక్కా ప్రణాళిక తోడైతే, ఏపీ పర్యాటక రంగం ప్రపంచ వేదికపై సగర్వంగా నిలుస్తుంది” అని మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ‘శ్రీ రతన్ టాటా హబ్’లో రాజమహేంద్రవరం టూరిజం హబ్ మరియు ఏపీటీడీసీ కాకినాడ డివిజన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించిన మంత్రి, పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. “ఇన్వెస్టర్లు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయం. రాయితీలు ఇవ్వడమే కాదు, ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో ఎదురయ్యే అడ్డంకులను మేమే ముందుండి తొలగిస్తాం.” అని ఇన్వెస్టర్లకు భరోసానివ్వాలని మంత్రి దుర్గేష్ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. 21 ప్రధాన దేవాలయాల్లో ‘టెంట్ సిటీలు’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించినట్లు అధికారులకు తెలిపారు. భక్తులు దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం కాకుండా అక్కడే బస చేసి సమీప ప్రాంతాలను చూసేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 50 వేల గదుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ‘లెమన్ ట్రీ’ వంటి ప్రముఖ హోటళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, 5-స్టార్ హోటళ్లు రాలేని టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లో ‘హోమ్ స్టే’ (మండువా లోగిళ్లు, విడిది ఇళ్లు) సంస్కృతిని ప్రోత్సహించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.కేవలం స్టార్ హోటళ్లు మాత్రమే కాకుండా, పర్యాటకులు గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారని… అందుకే పాత కాలపు ‘మండువా లోగిళ్లు’, విడిది ఇళ్లను హోమ్ స్టేలుగా మార్చుకునే వినూత్న అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.ఈ క్రమంలో గోదావరి పుష్కరాల నాటికి కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన ‘టెంట్ సిటీలు’, ‘హోమ్ స్టేలు’, హోటల్స్ లో గదులు సిద్ధం చేయాలన్నారు. “గోదావరి పుష్కరాలు కేవలం స్నానాలకు పరిమితం కాకుండా, భక్తులు మన సంస్కృతిని, ప్రకృతిని ఆస్వాదించేలా పర్యాటక హంగులు అద్దుతున్నాం.” అన్నారు. గోదావరి పుష్కరాలు జరిగే సంబంధిత జిల్లాల అధికారులు వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టి భక్తులకు వసతి సౌకర్యాల ఏర్పాటులో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి నుండే ఆ ప్రక్రియ మొదలుపెట్టాలన్నారు.

నూతన పర్యాటక పాలసీ 2024-29 తో పాటు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం, అనుబంధ పాలసీలైన ల్యాండ్ అలాట్ మెంట్, హోమ్ స్టే, క్యారవాన్, బి అండ్ బి తదితర వాటి వినూత్న పాలసీ వల్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. పీపీపీ విధానంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం భారీ రాయితీలు కల్పిస్తోందని వివరించారు.రాష్ట్రానికి పర్యాటక పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, వీరి చొరవతోనే ఏడాదిన్నర కాలంలోనే దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులు మరియు 100కు పైగా ఎంవోయూలు కుదిరాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఏపీ పర్యాటక వాణిని వినిపించి ఏపీని సగర్వంగా అన్ని వేదికలపై నిలబెడుతున్నామన్నారు. అన్ని దేశాల్లో మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి ఎస్ ఐపీబీలో, కేబినెట్ లో 2 పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తుందన్నారు. వాటన్నింటిని గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఇటీవల వైజాగ్-అరకు మధ్య ప్రారంభించిన కార్వాన్ టూరిజంకు విశేష స్పందన వస్తోందని. అదే తరహాలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ, రాష్ట్రవ్యాప్తంగా కార్వాన్, అడ్వెంచర్ మరియు హెలీ టూరిజం ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. కాకినాడ, ఉప్పాడ, పేరుపాలెం బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ దిశగా అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. కేరళ కంటే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఏపీలో ఉందని, అయితే ప్రచారం లోపించిందని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఏపీ పర్యాటక వైభవాన్ని చాటిచెప్పేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యలంక బీచ్, గండికోట వంటి ప్రాంతాలను ఐకానిక్ పర్యాటక ప్రాంతాలుగా వృద్ధి చేస్తున్నామన్నారు.

అసంపూర్తిగా ఉన్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే రద్దు చేసి కొత్త వారికి అప్పగించాలని మంత్రి దుర్గేష్ అధికారులను హెచ్చరించారు. వచ్చే నెలలో మరోమారు సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికి పూర్తిస్థాయి నివేదికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.పర్యాటక ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం అధికారులు పక్కా ప్లానింగ్‌తో వస్తే, అటు కేంద్రం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో నిధులు, అనుమతులు అందేలా చూస్తామని మంత్రి దుర్గేష్ భరోసా ఇచ్చారు.

 

ఈ సమావేశంలో రాజమహేంద్రవరం హబ్ రీజినల్ డైరెక్టర్ ఎన్.వీ.వీ.ఎస్ మూర్తి, డీవీఎం పవన్ కుమార్, ఈఈ భాస్కర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా పర్యాటకాధికారి పి. వెంకటాచలం, కాకినాడ జిల్లా సీఈవో లక్ష్మణ్ రావు మరియు కోనసీమ డీటీవో అన్నవార్ హెుస్సేన్, ఏలూరు డీటీవో ఎస్. పట్టాభిరామన్, పశ్చిమగోదావరి డీటీవో అన్నారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *