Breaking News

ఓటర్లు నిర్బయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి…

-బద్వేల్ ఉప ఎన్నిక పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బద్వేల్ ఉప ఎన్నికలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బద్వేల్ ఉప ఎన్నిక పటిష్టంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ ఈ నెల 30 శనివారం జరిగే బద్వేల్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని, వారిలో 13 మంది పురుషులు కాగా ఇద్దరు మహిళలు అని తెలిపారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకూ జరుగనున్న ఈ ఉప ఎన్నికలో మొత్తం 2 లక్షల 16 వేల 206 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. ఇందుకై 281 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ ప్రక్రియ యావత్తునూ వీడియో రికార్డింగ్ చేసేందుకు మొత్తం 271 మంది వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ప్రక్రియను నిరంతం పరిశీలించేందుకు వెబ్కాస్టింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆద్వరంలో జరిగే ఈ ఉప ఎన్నిక నిర్వహణకు మొత్తం 1,348 మంది అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది వినియోగార్థం మొత్తం 55 బస్సులు, 15 మినీ బస్సులతో పాటు ఇంటీరియర్ గ్రామాలకు వెళ్లేందుకు ఐదు తూఫాన్ వాహనాలను సమకూర్చడం జరిగిందన్నారు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లకు 380 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మరియు 408 వివిపాట్స్ ను పంపిణీచేయడం జరుగుచున్నదన్నారు. అయితే నేడు వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాటర్ ఫ్రూప్ షామియానాలను ఏర్పాటు చేసి వాటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ ఉప ఎన్నికకు పరిశీలకులుగా నలుగురు అధికారులు వ్యవహరిస్తున్నారని వారంతా పలు రాష్ట్రాల నుండి వచ్చినవారన్నారు. వీరిలో జనరల్ అబ్జర్వరు, పోలీస్ అబ్జర్వరు తో పాటు ఇద్దరు ఎక్స్ పెండిచర్ అబ్జర్వరులు ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమై పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 15 కంపెనీల సెంట్రల్ పారామిలటరీతో పాటు రాష్ట్ర ఆర్ముడ్ రిజర్వర్డు, ఏపిఎస్పి పోలీసులు, హోమ్ గార్డులు మొత్తం 2,622 మంది భద్రతా సిబ్బందితో పటిష్టం బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. డి.ఎస్.పి.లు 11 మంది, సి.ఐ.లు 47 మంది, ఎస్.ఐ.లు 157 మంది, ఏ.ఎస్.ఐ./హెడ్ కానిస్టేబుళ్లు 219 మంది మరియు పోలీస్ కానిస్టేబుళ్లు 136 మంది బందోబస్తు విధులను నిర్వహిస్తారన్నారు.
ఉప ఎన్నికకు 72 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటర్లు మినహా బయటి నుండి వచ్చిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పలు పార్టీల ప్రతినిధులు ఎవ్వరూ కూడా నియోజక వర్గ పరిధిలో లేకుండా చూడటం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న హోటళ్లు, అతథి గృహములు, కళ్యాణ మండపాలు, కమ్యునిటీ హాళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ నిశితంగా తినిఖీలు చేయడం జరిగిందన్నారు. నియోజక వర్గానికి నెల్లూరు, కర్నులు సరిహద్దులుగా ఉన్నాయని ఎన్నికకు 12 గంటల ముందుగానే ఆ సరిహద్దులు అన్నింటినీ మూసివేయడం జరుగుతుందన్నారు. నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహలను వేటినీ నియోజక వర్గంలోకి అనుమతించడం లేదని ఆయన తెలిపారు. పోలీస్ స్టేట్ నోడల్ అధికారి మరియు అదనపు డి.జి.పి., కర్నూలు డి.ఐ.జి., కపడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తదితరులు ఈ బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఉప ఎన్నికల సందర్బంగా ఇప్పటి వరకూ రూ.2 కోట్ల 10 లక్షల 55 వేల 816 ల విలువైన బంగారం, వెండి, మధ్యం, గంజాయి, వాహనాలు, నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంభందించి మొత్తం 19 కేసులను బుక్ చేయడం జరిగిందని, అందులో 8 కేసులకు సంబందంచి ఎఫ్.ఐ.ఆర్.లు ఫైల్ చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *