అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో పాల్గొన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంటనే పిఆర్సి నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని,ప్రతినెల 1వ తేదీన జీతాలు, ఫించన్లు చెల్లించేలా చూడాలని,కోవిడ్ తో చనిపోయిన ఉద్యోగుల స్థానే కారుణ్య నియామకాలు చేపట్టుటలో గల నిబంధనలు సడలించాలని,హెల్తు కార్డులు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే వరకూ మెడికల్ రీయింబర్సుమెంట్ కొనసాగించాలని, ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే వివిధ డిమాండులను ఈసమావేశం దృష్టికి తెచ్చారు.
ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ మాట్లాడుతూ సుమారు 10సంవత్సరాల తర్వాత ఈజాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.పిఆర్సి సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.పిఆర్సి సిఫార్సులు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పిఆర్సి కమిటీ అధికారులతో సమావేశమై పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుందన్నారు.పిఆర్సి నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సిఎస్ సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.సుమారు గత రెండేళ్ళుగా కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఆశా జనకంగా లేవని పరిస్థితులను ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని సూచించారు.పిఆర్సికై సుమారు మూడేళ్ళుగా ఎదురు చూస్తూన్నారని మరికొన్ని రోజులు పాటు వేచి ఉండాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలకు హితవు చేశారు.పిఆర్సి నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలన్న దానిపై ఆయన స్పందించి ఆనివేదిక సమ్మరీని వారం రోజుల్లోగా అందిస్తామని తెలిపారు.కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్ మరియు హెచ్ఆర్ ముఖ్య కార్యదర్శి ఒక సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.వివిధ ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.
సమావేశానికి స్వాగతం పలికిన సర్వీసెస్ మరియు హెచ్ఆర్ఎం ముఖ్య కార్యదర్శి శిశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 2010లో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగ్గా మరలా ఇప్పుడు జరుగుతోందని చెప్పారు.ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించి పరిష్కరించుకునేందుకు ఉన్న అత్యున్నత బాడీ ఇదని తెలిపారు.
అనంతరం ఎపి ఎన్జిఓ అధ్యక్షులు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పిఆర్సి రిపోర్టు వచ్చి ఏడాది అయిందని ఇంతవరకూ దానిని బయటపెట్టలేదని,ప్రతినెలా 1వతేదీన జీతాలు,ఫెన్సన్ లు అందేలా చూడాలని కోరారు.అలాగే గత కొన్ని మాసాలుగా పెండింగ్ లో ఉన్నా జిపిఎఫ్, ఎపిజిఎల్ఐ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.2018 జూలై 1నుండి 50శాతం పిట్మెంట్ తో పిఆర్సి అమలు చేయాలని కోరారు.నాల్గవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్ళకు పెంచాలని కోరారు.సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు,పెండింగ్ బిల్లులు విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.అదే విధంగా హెల్తుకార్డులు సమస్య పరిష్కారం అయ్యే వరకూ మెడికల్ రీఇంబర్సుమెంట్ ను కొనసాగించాలని కోరారు.సచివాలయంలో ఖాళీగా ఉన్న ఎఎస్ఓ పోస్టులు భర్తీ చేయాలని,ఉద్యోగులందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని,నాల్గవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్ళకు పెంచాలని ఇంకా పలు అంశాలను సమావేశం దృష్టికి తెచ్చారు.ఎస్టియుఎపి అధ్యక్షులు జోషెఫ్ సుధీర్ మాట్లాడుతూ ప్రతి ఆరు మాశాలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని,ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుండి మినహాయించాలని కోరారు.ఎపిటిఎఫ్ అధ్యక్షులు హృదయరాజు మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దుచేయాలని కోరారు.ఎపియుటిఎఫ్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని సమస్యలను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలిపారు.
ఎపి రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1వతేదీనే జీతాలు,ఫించన్లు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,జిపిఎఫ్,ఎపిజిఎల్ఐ,ఎస్ఎల్ఎస్, మెడికల్ తదితర పెండింగ్ బిల్లులు సకాలంలో విడుదలయ్యేలా చూడాలని కోరారు. సిఎఫ్ఎంఎస్ వరం అనుకుంటే శాపంగా మారిందని దానిపై ఒక బాధ్యతాయుతమైన అధికారిని పెట్టాలని,నాల్గవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్ళకు పెంచాలని, సిపిఎస్ రద్దు చేయాలని కోరారు.ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కలక్టర్ల ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కొన్సిల్ సమావేశాలు నిర్వహిస్తే చాలా వరకూ ఉద్యోగుల సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు.ఇంకా ఎపి ట్రెజరీ సర్వీసెస్ సంఘం అధ్యక్షులు రవికుమార్,ఎపి కోఆపరేటివ్ సర్వీసెస్ సంఘం అసోషియేట్ అధ్యక్షులు నాగ రమణయ్య,ఎపి సర్వే ఎంప్లాయిస్ సంఘం అధ్యక్షులు లక్ష్మీ నారాయణ,ఎపి లైవ్ స్టాక్ సర్వీసెస్ సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ,ఎపి టైపిస్ట్స్,స్టెనోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షులు మోహన్ గోపాల కృష్ణ తదితర 13 సంఘాల ప్రతినిధులు సమావేశాలు మాట్లాడారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్ చంద్ర, ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్,వి.ఉషారాణి,గోపాల కృష్ణ ద్వివేది,బి.రాజశేఖర్,కార్యదర్శి శ్యామల రావు,అరుణ్ కుమార్,కె.భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News