
-దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయ్…
వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశం అభివృద్ధి పధంలో పరుగులు పెడుతుంది…: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యువత దేశ భవితని అటువంటి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించడం ద్వారా దేశాన్ని అభివృద్ధిపథంలో నిలపవచ్చని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఆదివారం వివిధ విభాగాలలో శిక్షణ పొందుతున్న యువతీ యువకుల ముఖాముఖి కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మహాకవి గురజాడ అన్న ” దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ ” మాటలు గుర్తు చేసారు. దేశం జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారు ఉన్నారని, వారిలో 20 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారు 50 శాతం మంది ఉన్నారన్నారు. ఇంతటి మానవ వనరులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరని, అటువంటి మానవనరులను కలిగి ఉండడం మన దేశం అదృష్టమన్నారు. వీరికి వారి అభిరుచి ఉన్న రంగంలో శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్నారు. యువత జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు ఇష్టంతో కష్టపడాలన్నారు. ప్రతీ మనిషి జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని దీనితోపాటు సమయపాలన, నిజాయితీ, అంకితభావం కలిగి ఉండాలన్నారు. యువతకు తాను కోరుకున్న రంగంలో శిక్షణ అందించి తద్వారా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్వర్ణభారతి ట్రస్ట్ కృషి చేస్తోందన్నారు. శిక్షణ పొందుతున్న యువత వారి శిక్షణ పొందుతున్న రంగంలో అద్భుతంగా రాణించేలా కృషి చేయాలన్నారు. మన పురోభివృద్ధికి పాటుపడుతున్న తల్లితండ్రులను ప్రేమించాలన్నారు. తల్లితండ్రులతో పాటు గురువులను, మాతృభాషని ప్రేమించి గౌరవించాలన్నారు. మాతృభాష కళ్ళు వంటిదని, పరాయి భాష కళ్ళజోడు వంటిదన్నారు. కళ్ళు ఉంటేనే కళ్ళజోడు అవసరం ఉంటుందని, మాతృభాషలో ప్రావీణ్యం సాధించినప్పుడే ఇతర భాషలలో పట్టు ఉంటుందన్నారు. యోగ ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రతీ వ్యక్తి దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. దేశభక్తి అంటే ఎవరి పనిని వారు నిజాయితీగా చేయడమేనన్నారు. క్రీడలలో మనదేశంపై పరాయి దేశం విజయం సాధిస్తే మన దేశంలో సంబరాలు చేసుకోవడం తప్పని, అది దేశాన్ని అవమానించడమేనన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చిన భారతీయ సనాతన ధర్మాన్ని దేశంలోని ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైనదన్నారు. కుల, మాత, వర్ణ, వర్గాల పేరుతో ప్రజలను చీల్చే అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ మేనేజర్ పరదేశి, వివిధ విభాగాల శిక్షణాధిపతులు విజయ భాస్కర్, లక్సమ్ తులసి, జ్ఞానేంద్ర, ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News