విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సత్వర పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జన్ భాగీధారీ” వారోత్సవ కార్యక్రమాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పీఎం జన్మన్ గిరిజన గ్రామాలలో “జన్ భాగీధారీ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు గిరిజన గ్రామాలలో ప్రత్యేక ఆరోగ్య క్యాంపులను నిర్వహించడం, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గిరిజనుల నుండి వినతులు లేదా ఫిర్యాదులు స్వీకరించడం, వాటికి పరిష్కారాన్ని చూపడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి వారికి పథకాలు అమలయ్యేలా చూడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ అధికారులు , ఆరోగ్య శాఖ సిబ్బంది జన్ భాగీధారీ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ముందుగా జన్ భాగీధారీ ప్రచార చిత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News