అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ” కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర నుంచి విచ్చేసిన “యువ సంగం” విద్యార్ధి బృందం ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. ఈ బృందం గ్రౌండ్ ఫ్లోర్‌లోని “అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(AICCC)ను సందర్శించింది.
APCRDA అధికారులు.. రాజధాని అమరావతిని రైతుల భాగస్వామ్యంతో ఏ విధంగా ప్రణాళికాయుతంగా నిర్మిస్తున్నామో AICCCలోని భారీ స్క్రీన్‌పై వివరించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ తదితర నిర్మాణాల గురించి, అలాగే రిజర్వాయర్లు, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్న ట్రంక్ ఇన్‌ఫ్రా సదుపాయాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం “యువ సంగం” బృందంతో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ మాట్లాడారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ప్రజారాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా APCRDA సమగ్ర ప్రణాళికతో, నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తూ పని చేస్తోందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డా. పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో రాజధాని పనులు ప్రణాళికాయుతంగా, ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు అనుగుణంగా జరుగుతున్నాయని కమిషనర్ వివరించారు.
Prajavartha Online Telugu News