-భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
-NH, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం అందిస్తోన్న సహకారం అందిపుచ్చుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన మంత్రి
-డిసెంబర్ 2026 నాటికి పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి దిశానిర్ధేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను త్వరితగతి పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఒక నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.. నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ రహదారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులతో 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.. గతేడాది ఆగస్టు లో నిర్వహించిన 3 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా అధికారులను ప్రాజెక్టుల వారీగా వివరాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు…
జాతీయ రహదారుల ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో జాతీయ రహదారులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు.. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులకు అన్ని విధాలుగా సహాయ సహాకారాలు అందిస్తోన్న క్రమంలో, వాటిని అందిపుచ్చుకుని, సద్వినియోగం చేసుకునే దిశలో అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. జాతీయ రహదారుల ప్రాజెక్టులు (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), కేంద్ర రోడ్లు, రవాణా, హైవే మంత్రిత్వశాఖ (MoRTH) ఆధ్వర్యంలో) జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించడం జరిగింది. 3 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన పురోగతిని అధికారులు ప్రాజెక్టుల వారీగా మంత్రికి వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల సంబంధించి గత టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం అనంతరం ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి 21 అంశాలను పరిష్కరించగా, ఇందులో 9 పూర్తిగా, మరో 12 సమస్యలు పార్శికంగా పరిష్కరించామని అంధికారులు మంత్రికి వివరించారు.. ఈ సమావేశంలో జాతీయ రహదారుల్లో భూసేకరణకు సంబంధించిన 10 అంశాలను, అటవీ శాఖకు సంబంధించి 1 అంశం, మరొ ఇతర అంశం వేగవంతంగా పరిష్కరించాలని మంత్రి అధికారులుకు సూచించారు. అలాగే MORTH మరియు R&B కు సంబంధించిన భూసేకరణలో 12 అంశాలను, అటవీ శాఖకు సంబంధించి 5 అంశాలు, మరొ ఇతర అంశాలను త్వరితగతిన పూర్తి చేసి, పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు సహకరించాలని మంత్రి కోరడం జరిగింది..
ఇప్పటి వరకు మొత్తం 602 కి.మీ రోడ్ల భూసేకరణకు సంబంధించి 397 కి.మీ మేర భూసేకరణ పూర్తయ్యిందని తెలపడం జరిగింది. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేసి, రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలు చాలావరకు పరిష్కరించబడ్డాయి. మిగిలిన ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ & బీ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, సీసీఎల్ఎ సంయుక్త కార్యదర్శి చేతన్, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండ్, MoRTH ప్రాంతీయ అధికారి హరికృష్ణ, (ఆర్ & బీ) శాఖ ఈఎన్సీ వి. రామచంద్ర, NHAI ప్రాంతీయ అధికారి ఆర్ కే సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*********
రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష
2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో 3 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సాధించిన పురోగతిని మంత్రి ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు..
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న R0B/RUB లను వేగవంతం చేయాలని రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు.. రాష్ట్రంలో మంజూరైన అన్ని రైల్వే మార్గాలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.. ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ సమస్యలను జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్ లతో నెల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహించి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. కోటిపల్లి – నర్సాపురం, నడికుడి – శ్రీ కాళహస్తి, భద్రాచలం – కొవ్వూరు, కడప – బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కాస్ట్ షేరింగ్ విధానంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి అధికారులకు తెలియజేశారు.. అదే సమయంలో రాజధాని అమరావతి పరిధిలోని నంబూరు – అమరావతి రైల్వే లైన్ కు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని CRDA అధికారులతో మాట్లాడాలని అధికారులకు మంత్రి సూచించారు. విశాఖ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో మంచి నీటి పైప్ లైన్ షిప్టింగ్ పనులు వేగవంతం చేయాలని మంత్రి రైల్వే అధికారులకు సూచించారు. బేతంచెర్ల, నంద్యాలలో రైల్వే సబ్ వే ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రైల్వే అధికారులను ఆదేశించారు.. నిర్మాణంలో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబర్ లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ & బీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎం. టీ కృష్ణబాబు, రైల్వే శాఖ ఛీప్ ఇంజనీర్లు కె. సూర్యనారాయణ, డి. శ్రీనివాసరావు, హెచ్ కే బగూరియా, తదితర రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News