-రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజక్టులపై సమగ్ర సమీక్ష జరిగిందని, ఇందులో 25 పాత ప్రాజెక్టులతో పాటు 11 కొత్త ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నీటిపారుటల శాఖకు నిర్థేశించడం జరిగిందన్నారు. ప్రతి ప్రాజెక్టుకు శంకుస్థాపన, పురోగతి, పూర్తి గడువులు ఖచ్చితంగా నిర్దేశించబడటం జరిగిందన్నారు.
2026–2028 కాలానికి 36 ప్రాజెక్టుల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక…..
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన 25 ప్రాజెక్టులతో పాటు, సీఎం గుర్తించిన మరో 11 ప్రాజెక్టులను కలిపి మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన ప్రాధాన్యతా క్రమం, దశలవారీ గడువులు, అమలు ప్రణాళిక రూపొందించబడిందన్నారు. 2026 జూలై నాటికి పోలవరం LMC ద్వారా ఉత్తరాంధ్రకు నీటి సరఫరా, గుంటూరు ఛానల్ మోడరేషన్ పనుల శంకుస్థాపన, తుంగభద్ర కొత్త 33 గేట్ల ప్రారంభం వంటి కీలక పనులు అమలులోకి వస్తాయన్నారు. 2026 ఆగస్టు నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్–1 పూర్తి, అనంతపురం జిల్లాలో పేరూరు బ్రాంచ్ కెనాల్ శంకుస్థాపన, పాలేరు రిజర్వాయర్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. 2026 అక్టోబర్ నాటికి హంద్రీ–నీవా (HNSS) ఫేజ్–2 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. నవంబర్ 2026లో నేరేడి బ్యారేజ్ శంకుస్థాపన జరగనుందన్నారు. 2026 డిసెంబర్ నాటికి పెన్నా–సర్వేపల్లి రిజర్వాయర్ పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 2027 జనవరి నాటికి మడ్డువలస స్టేజ్–2 పూర్తి కావడంతో పాటు నీవా బ్రాంచ్ కెనాల్ మూలపల్లి వరకు ప్రారంభం కానుందన్నారు. 2027 ఏప్రిల్ నాటికి హీరమండలం ఎత్తిపోతల లిఫ్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. 2027 జూన్ నాటికి నాగావళి–చంపావతి నదుల అనుసంధానం, బుడమేరు వరద రక్షణ పనులు, కొల్లేరు ప్రక్షాళన, ముక్త్యాల ఎత్తిపోతల పథకం మరియు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడిందన్నారు. 2027 జూలై నాటికి వంశధార స్టేజ్–2, చింతలపూడి ఎత్తిపోతల పథకం, మహేంద్రతనయ–గజపతినగరం బ్రాంచ్ కెనాల్స్, తోటపల్లి డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు. 2027 డిసెంబర్ నాటికి మూలపల్లి లిఫ్ట్ ద్వారా కళ్యాణి డ్యామ్ వరకు నీటి అనుసంధానం, మడకశిర బ్రాంచ్ కెనాల్, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 2028 డిసెంబర్ నాటికి తారకరామ సాగర్, వేదావతి ఎత్తిపోతల ప్రాజెక్టు, అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప (BTP), అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులు, GNSS విస్తరణ (కడప–రాజంపేట–కోడూరు), సోమశిల–స్వర్ణముఖి లింక్ కెనాల్, గోదావరి డెల్టా ఆధునీకరణ (LIDAR సర్వే ఆధారంగా), SRMC విస్తరణ (40,000 నుండి 80,000 క్యూసెక్లకు), GNSS కోడూరు వరకు విస్తరణ, అలాగే వరికపూడిశల ప్రాజెక్టు పూర్తి చేయాలని సమగ్ర లక్ష్య ప్రణాళిక రూపొందించబడిందన్నారు. ఈ విధంగా 2026 నుండి 2028 వరకు రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని సమూలంగా మారుస్తూ, ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన లక్ష్యం, గడువు, అమలు దిశను ప్రభుత్వం ఖరారు చేసిందని మంత్రి తెలిపారు.
చరిత్ర సృష్టించిన తొలి విజయాలు….
హెచ్ఎన్ఎస్ఎస్ (HNSS) ఫేస్–1 విషయంలో గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనిని ఈ ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3,860 కోట్ల వ్యయంతో 728 కి.మీ మేర విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే ఈ కీలక ప్రాజెక్టు 2025 జూలై నాటికి లక్ష్యాన్ని చేరుకుని చారిత్రక ఘట్టంగా నిలిచిందన్నారు. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ (LMC) విషయంలో గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని స్థితిలో, ఈ ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.1,400 కోట్లు వెచ్చించి కీలక నిర్మాణ పనులను వేగవంతం చేసింది. హిల్ కట్టింగ్, పంపింగ్ వ్యవస్థల వంటి క్లిష్టమైన పనులు శరవేగంగా కొనసాగుతూ, 2026 జూలై నాటికి ఉత్తరాంధ్రకు నీటిని అందించే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. మూడు దశాబ్దాల కలగా మిగిలిపోయిన వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్–1ను 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు జీవనాధారంగా నిలిచే ఈ ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణ….
పోలవరం ప్రాజెక్టు గత పాలనలో డయాఫ్రామ్ డ్యామేజీపై వాస్తవాలు దాచిపెట్టి, అసెంబ్లీలో తప్పుడు గడువులు ప్రకటించిన పరిస్థితుల్లో అనిశ్చితికి లోనైందన్నారు. ఈ పరిస్థితిని సరిచేస్తూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టును స్వయంగా సందర్శించి, 2027 జూన్/జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. దీంతో ప్రాజెక్టు తిరిగి పురోగతి దిశగా సాగుతోంది.
లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ పునరుజ్జీవనం – 10 ఏళ్ల నిర్వహణ మోడల్….
రాష్ట్రంలో సుమారు 8 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆధారపడి ఉన్నాయని, గత పాలనలో 1,040 లిఫ్టుల్లో కేవలం 156 మాత్రమే పనిచేసే స్థితికి దిగజారాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా లిప్టు మరమ్మతులు మరియు నిర్వాహణ బాధ్యతలను 10 సంవత్సరాల పాటు ఒకే ఏజెన్సీకి అప్పగించే విధానం తీసురానున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా నిరంతర నిర్వహణ, నిధుల వినియోగ పారదర్శకత, రైతులకు స్థిరమైన నీటి సరఫరా సాధ్యమవుతుందన్నారు.
వాటర్ క్యాలెండర్ – ప్రణాళికాబద్ధ నీటి విడుదల విధానం….
మొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ప్రతి ప్రధాన డెల్టా, ప్రాజెక్టుకు సంబంధించి నీటి విడుదల తేదీలను స్పష్టంగా ప్రకటిస్తూ వాటర్ క్యాలెండర్ విడుదల చేయబడుతుందన్నారు. పెన్నా డెల్టా కి ఇప్పటికే మే-4 వ తేదీ నుండి సాగు నీటిని విడుదల చేస్తున్నామని, గోదావరి డెల్టాకు జూన్-1 వ తేదీ నుండి, గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్) కింద ఉన్న ఆయకట్టుకు జూన్-10వ తేదీ నుండి, టిజిపి కడప (ఎస్పీవీబీఆర్ కడప) కు జూన్-15 నుండి సాగు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని వంశధార ఆయకట్టుకు జూన్-15వ తేదీ నుండి, తోటపల్లి ఆయకట్టుకు జూలై-1 నుండి, కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై-1వ తేదీ నుండి, ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూలై-10 నుండి, కేసి కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, టిబిపిఎల్‌ఎల్‌సి, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు కు జూలై-15 నుండి, టిబిపిహెచ్‌ఎల్‌సి కింద ఉన్న ఆయకట్టుకు జూలై-20 నుండి, హంద్రీనీవా సుజలస్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఆయకట్టుకు జూలై-31 నుండి, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద జోన్-1 (పల్నాడు, గుంటూరు, బాపట్ల) కు జూలై -31 న, జోన్-2 (ప్రకాశం, మార్కాపురం) ఆయకట్టుకు ఆగష్టు చివరి వారంలో సాగునీటి విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు. దీనివల్ల వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ సమన్వయంతో రైతులు ముందస్తుగా సిద్ధం కావడానికి అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు.
జలధార–జలహారతి కార్యక్రమం – ప్రజా ఉద్యమ దిశగా….
భూగర్భ జలాలను పెంపొందించి భూమినే రిజర్వాయర్‌గా మార్చే లక్ష్యంతో ప్రారంభించిన జలధార–జలహారతి కార్యక్రమం ప్రస్తుతం వంద రోజుల ప్రణాళికలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం సమీక్షిస్తూ, ప్రతి క్యాబినెట్ సమావేశంలో పురోగతిని పరిశీలిస్తూ ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Prajavartha Online Telugu News