Breaking News

మహిళలకు అండగా ఆర్టీసీ… స్త్రీ శక్తి పథకంతో ఆర్థిక వెసులుబాటు

-స్త్రీ శక్తితో ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ
-స్త్రీ శక్తితో తగ్గిన మరణాలు… ప్రమాదాలు
-స్త్రీ శక్తి లబ్దిదారులకు సరాసరి నెలకు రూ. 2 వేలకు పైగా ఆదా
-9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు… రూ. 2350 కోట్ల సబ్సిడి
-25 లక్షల ఉచిత ప్రయాణాలు చేసిన దివ్యాంగులు
-సంక్షేమ చరిత్రలో ఆర్టీసీకి ప్రత్యేక స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వం
-ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం… ప్రయాణీకుల సౌకర్యమే లక్ష్యంగా అడుగులు
-ఆర్టీసీ సేవలపై ప్రతీ వారం సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి
-సిబ్బందికి నైట్ అవుట్ అలవెన్స్ – కష్టానికి గౌరవం
-ప్రమోషన్లతో భారీ ఊరట – వేలాది మందికి న్యాయం
-SBI ప్రత్యేక బీమా పథకం – ఉద్యోగులకు భద్రతా కవచం
-రిటైర్డ్ ఉద్యోగులకు జీవితాంతం EHS – మానవీయ నిర్ణయం
-ఈవీలతో ఆర్టీసీకి కొత్త హంగులు
-ఆర్టీసీ బస్ స్టేషన్లల్లో వసతులపై సీఎం వారం వారం సమీక్ష… నిత్యం ప్రజాభిప్రాయ సేకరణ
-రెండేళ్ల ప్రయాణంలో పరుగులు పెడుతున్న ప్రగతి రథ చక్రం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ అనేది ప్రజా రవాణ వ్యవస్థగానే కాదు… మహిళలకు, దివ్యాంగులకు ఆర్థికంగా అండగా నిలిచే వ్యవస్థగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దింది. తొలి నుంచి ఆర్టీసీ అనేది ఓ ప్రజా రవాణ వ్యవస్థగానే ప్రభుత్వాలు భావించాయి. కానీ ఈ ప్రజా రవాణ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించే నిర్ణయాలు తీసుకోవచ్చు.. పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పించవచ్చు అని కూటమి ప్రభుత్వమే నిరూపించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2025 ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. అప్పటి వరకు బస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వాలనే చూసిన ప్రజలకు… స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పరిచయం చేసింది కూటమి ప్రభుత్వం. ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా.. ఎలాంటి షరతులు.. నిబంధనలు లేకుండా అమలవుతున్న ఏకైక పథకంగా స్త్రీ శక్తి పథకమే. ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి సంక్షేమ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మిగిలిన పథకాలన్ని ఒక ఎత్తు… స్త్రీ శక్తి పథకం మరో ఎత్తు అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

స్త్రీ శక్తి పథకంలో ఉన్న గొప్పదనమిదే…

స్త్రీ శక్తి పథకంతో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం ఆదా అవుతోంది. ఇది మహిళల్లో ఆర్థిక సాధికారత పెంచింది. ఓ మహిళా ఉద్యోగి ఆఫీసుకు వెళ్లాలన్నా.. ఓ యువతి కాలేజీకి వెళ్లాలన్నా.. మహిళా రైతు ఉత్పత్తులను మార్కెట్టుకు తీసుకెళ్లి అమ్ముకోవాలన్నా ఆర్టీసీ బస్సెక్కి ఉచితంగా తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. అంతే కాకుండా పుట్టింటికి వెళ్లాలన్నా.. బంధువుల ఇంటికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అలాగే పండుగ దినాల్లో పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి సుమారుగా రూ. 2 వేల నుంచి 2,500 ఆదా అవుతున్నట్టు అంచనా. అంటే ఏడాదికి సుమారుగా రూ. 25 వేలు ఆదా అవుతోందని లబ్దిదారులే స్వయంగా చెబుతున్నారు. ఇక స్త్రీ శక్తి పథకం వల్ల దేవాలయాలకు ఆదాయం పెరుగుతోంది.. పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి మెరుగవుతోంది. అందుకే ఈ పథకం సూపర్ హిట్ అయింది. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన 9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగితే.. సుమారు రూ. 2350 కోట్ల మేర సబ్సిడిని ప్రభుత్వం భరించింది. దీనికి గానూ.. రూ. 720 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీ-ఇంబర్స్ చేసింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు రీ-ఇంబర్స్ చేస్తూ ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి స్త్రీ శక్తి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సుమారుగా 92 శాతానికి పెరిగింది. గతంలో సుమారుగా 60 శాతంగా ఉండే ఆక్యుపెన్సీ రేషియో స్త్రీ శక్తి పుణ్యమా అని 92 శాతానికి చేరింది. ఇందులో పురుష ప్రయాణికుల సంఖ్య 40 శాతంగా ఉంది. ఈ పథకం ఓ విధంగా ఆర్టీసీకి అండగా నిలుస్తోంది. స్త్రీ శక్తి కింద వచ్చే సబ్సిడీని ప్రభుత్వం నుంచి అందుకుంటోంది.. అలాగే పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో ద్వారా ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఇక దివ్యాంగ శక్తి కింద దివ్యాంగులు సుమారు 25 లక్షల ఉచిత ప్రయాణాలు జరిగాయి.

ప్రాణాలు కాపాడుతున్న స్త్రీ శక్తి…

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అనేది ఏపీఎస్సార్టీసీకి ఉన్న బ్రాండ్. ఈ బ్రాండ్ నిలబెట్టేలా స్త్రీ శక్తి పథకం ఆర్టీసీకి ఉపకరిస్తోంది. స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. చాలా మంది మహిళలు ఆటోల్లో… ఇతర వాహానాల్లో ప్రయాణాలు తగ్గించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడి చనిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ నిర్వహించిన సర్వే ప్రకారం స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రమాదాల్లో మహిళా మరణాల సంఖ్య దాదాపు 39 శాతం మేర తగ్గినట్టు వెల్లడైంది. అలాగే ప్రమాదాల్లో పురుషుల మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా ఎస్పీ వివరించారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధ్యయనం చేయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆర్టీసీని, ఉద్యోగులను ఆదుకునేలా ప్రభుత్వం చొరవ…

ఎన్నికలకు ముందు సిబ్బంది సమస్యలు, పెండింగ్ బకాయిలు, బస్సుల కొరత వంటి అనేక సవాళ్లను ఆర్టీసీ ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవల మెరుగుదల, ఆధునికీకరణ, ఆర్థిక బలోపేతం లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువసేపు విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో సేవలు అందించే సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి నైట్ డ్యూటీకి రూ. 150 చొప్పున నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు నెలకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఊరటనిస్తోంది. ప్రమోషన్ల విషయంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించింది. 2020కు ముందు నియమితులై ప్రభుత్వ సేవల్లో విలీనమైన ఉద్యోగులకు పాత RTC మార్గదర్శకాలను పునరుద్ధరించడంతో సుమారు 7 వేల మందికి పదోన్నతులు లభించాయి. ఈ నిర్ణయం ఉద్యోగుల కెరీర్ పురోగతికి దోహదపడుతోంది. అనేక మంది ఉద్యోగులు పదోన్నతుల ద్వారా అధిక వేతనాలు, బాధ్యతలు పొందే అవకాశం కలిగింది.

SBI ప్రత్యేక బీమా పథకం – ఉద్యోగులకు భద్రతా కవచం

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే PTD ఉద్యోగులకు కూడా SBI SGSP పథకం వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించింది. రూ. 1 కోటి ప్రమాద భీమా, సహజ మరణానికి రూ. 10 లక్షల బీమా వంటి ప్రయోజనాలు ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తున్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, తక్కువ వడ్డీ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను సులభతరం చేస్తున్నాయి. ఇక విరమణ అనంతరం వైద్య ఖర్చులు భారం అవుతాయని భావించే ఉద్యోగులకు ప్రభుత్వం జీవితాంతం EHS వైద్య సేవలు అందేలా నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఈ సదుపాయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ చర్య ప్రభుత్వం ఉద్యోగులను కేవలం సేవా కాలంలో మాత్రమే కాకుండా, జీవితాంతం ఆదుకుంటుందనే నమ్మకాన్ని కల్పించింది. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంది. ముఖ్యంగా అర్హతల విషయంలో సడలింపులు ఇవ్వడం వల్ల అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయి.

కొత్త బస్సులతో ఆధునిక ప్రయాణం

1,489 కొత్త బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను ఆధునికీకరించింది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, వెన్నెల వంటి బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఈ కొత్త బస్సులు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 1450 ఈవీ బస్సులు త్వరలో రాబోతున్నాయి. ఇదే కాకుండా… బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 338 బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించి ప్రజా రవాణా మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. ఆధునిక టాయిలెట్ బ్లాకులు, కూర్చునే సదుపాయాలు, ఫ్యాన్లు, శుభ్రత చర్యలు ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని కల్పిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ – ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం

129 బస్ స్టేషన్లలో డిజిటల్ స్కానర్ల ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించే వ్యవస్థను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అందించే సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా తెలిపే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రతి వారం ఆర్టీసీ సేవలపై స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్టీసీ పునర్వైభవానికి బలమైన పునాది వేశాయి. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవల మెరుగుదల, ఆధునికీకరణ, పర్యావరణహిత రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన దూరదృష్టితో ఆర్టీసీ రెండేళ్ల ప్రయాణం సాగింది. రెండేళ్లల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రగతి రథ చక్రం పరుగులు పెడుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *