-ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6-15 వరకు సిపిఐ ప్రచార కార్యక్రమాలు
-28న చలో దిల్లీకి పిలుపు
-అమరావతి ఫ్రీ జోన్ చేయాలి
-బలవంతపు భూసేకరణ ఆపాలి
-సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
-వ్యాట్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి
-బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాలి
-జనాభా పెంపుపై ప్రభుత్వ ప్రోత్సహకాలు ద్వంద్వ వైఖరి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.0.90 పైసలు చొప్పున పెంచారని, ఈ నెల 15న పెట్రోల్ లీటర్ పై రూ.3.29, డీజిల్ లీటరుకు రూ.3.14లకు పెంచారని, మళ్లీ వెంటనే 90 పైసలు పెంచి, పదేపదే ప్రజలపైన మోదీ ప్రభుత్వం భారాలు మోపుతోందన్నారు.12 ఏళ్ల మోదీ పరిపాలనలో దేశంలో నిత్యం పెట్రోల్, డీజిల్, వంటనూనెల ధరలు పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు.
విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ…అసలు దేశానికి మోదీ చేసిందేమీటి?, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని నిలదీశారు. నాడు రైతులను అన్ని రకాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన మోదీ.. ఈ రోజు వారి సమస్యల్ని ఆలకరించడం లేదన్నారు. పొదుపు చర్యల పేరుతో పెట్రోల్, డీజిల్ వాడొద్దని, వంట నూనెలు తగ్గించాలని, మరోవైపు రైతులను సైతం ఎరువుల వాడకం తగ్గించాలంటూ మోదీ సూచనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఎరువులు తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి వంటి సూచనలు ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు, హోటల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయాయని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పినా, ఇప్పటికీ వాటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను తగ్గించడంలో విఫలమైందని, ధరల పెరుగుదలతో సాధారణ ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. అమెరికా సామ్రాజ్యవాద శక్తులకు ప్రధాని మోదీ ప్రభుత్వం తలొగ్గుతున్నదని, డొనాల్డ్ ట్రంప్‌కు అన్ని రకాలుగా సేవకుడిగా పనిచేస్తున్నాడని విమర్శించారు. ట్రంప్ కనుసన్నల్లో మోదీ నడుస్తున్నారని, ఇజ్రాయేల్ దేశానికి దాసోహంగా మారారని విమర్శించారు. మోదీ ప్రభుత్వ విధానాలతో దేశ వ్యాప్తంగా లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 2 కోట్ల 26 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందనేది సాక్ష్యాత్తూ నీతి ఆయోగ్ నివేదిక ద్వారా వెల్లడైందని వివరించారు. వరుసగా పాఠశాలలను మూసివేస్తూ విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్నారన్నారు. విద్యను అందరికీ అందుబాటులోకి తేవడంలో, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో, దళారితనాన్ని తగ్గించడంలో, రైతు సమస్యలకు పరిష్కారం చూపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలను మత ప్రాతిపదికన విభజించి ఓట్ల రాజకీయాలు చేయడమే మోడీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే చర్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమ కార్యక్రమాలను సీపీఐ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం వరకు అన్ని రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టి ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. కార్పొరేట్ శక్తులకు, ముఖ్యంగా అంబానీలు, అదానీలకు అనుకూలంగా పనిచేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి నిరసన తెలియజేయడానికి సెప్టెంబర్ 28వ తేదీన చలో దిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు రామకృష్ణ బదులిస్తూ అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించి, అన్ని జిల్లాల ప్రజలకు రాజధానిగా ఉండేలా చూడాలన్నారు. అమరావతి రాజధాని పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అరికట్టాలని, రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా ధరలు పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతోందన్నారు. అదే సమయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర నిరసనలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ పన్ను పేరుతో దాదాపు 35 శాతం వరకు ప్రజలపై అదనపు భారం వేస్తోందని, తక్షణమే వ్యాట్ పన్ను తగ్గించాలని సీపీఐ తరపున డిమాండ్ చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన గుర్తుచేస్తూ, ఇప్పుడు అధికారంలో ఉన్నందున వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు రూ.60 పరిధిలోనే పెట్రోల్, డీజిల్ అందించే అవకాశముందని సూచించారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత ఉందంటూ కొన్ని చోట్ల ‘నోస్టాక్’ బోర్డులు పెట్టినప్పటికీ..ప్రభుత్వం మాత్రం ఎక్కడా కొరత లేదని ప్రచారం చేస్తోందన్నారు. వాస్తవానికి ప్రజలపై భారం తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా వ్యాట్ తగ్గించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల పేరుతో అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరపాలక సంస్థల వరకు ఎక్కడ చూసినా అక్రమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినా కూడా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనికి ప్రధాన కారణం అధికార కూటమికి చెందిన కొంతమంది నేతలే ఈ అక్రమ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు చేశారు. తిరుపతి నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల వరకు ప్రతిరోజూ మీడియాల్లో వార్తలు వస్తున్నప్పటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి, వాటిని పూర్తిగా నిషేధించాలని, ఇందులో భాగస్వాములైన వారిపై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనాభా పెంపుపై ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రోత్సాహకాలపైన ఈశ్వరయ్య మాట్లాడుతూ..తాము ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోనే పరిమితమై ఉంటూ, పేద ప్రజలను మాత్రం ఎక్కువ మంది పిల్లలు కనాలని ప్రోత్సహించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. జనాభా తగ్గిపోవడం, భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గి ముసలివారి జనాభా పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తే, అలాంటి పరిస్థితుల్లో ప్రజలను ప్రోత్సహించే విధంగా స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలున్న కుటుంబం మూడో బిడ్డను కంటే ఒక హెక్టారు భూమిని ఉచితంగా ఇవ్వడం, ఆ పిల్లల విద్య, వైద్యాన్ని జీవితాంతం ఉచితంగా అందించడం వంటి హామీలను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. ఏ ప్రభుత్వం మారినా కూడా ఆ హామీలు కొనసాగేటట్లు చట్ట పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం రూ.30వేలు, రూ.40వేలు ఇస్తామని చెప్పడం సరైన పరిష్కారం కాదని విమర్శించారు. సీఎం చంద్రబాబుకు, లోకేశ్‌కు ఒక్కొరే ఉంటే..పేదలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలంటూ ఆదేశించడం అర్హరహితమన్నారు. నేడు విద్యా, వైద్య ఖర్చులు అమాంతం పెరిగిపోయాయని, ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యకే రూ.3.50వేల వరకు ఖర్చు అవుతోందని, విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం కూడా సామాన్యులకు అందని స్థాయికి వెళ్లిందని, ఈ సమస్యలను పరిష్కరించకుండా చిన్న మొత్తాల ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. నిజంగా జనాభా పెరుగుదల అవసరమని ప్రభుత్వం భావిస్తే, కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భరోసా, విద్యా, వైద్య హామీలు ఇవ్వాలని సీపీఐ తరఫున డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌జిల్లా పెనుగంచిప్రోలులో జూన్ 10 నుంచి 15వరకు సీపీఐ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు చెందిన నాయకులు ఈ శిబిరంలో పాల్గొంటారన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News