-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయస్థాయిలో వ్యర్ధాల నిర్వహణపై ఉత్తమ విధానాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రదర్శించారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
గత సమావేశంలో వ్యర్థపదార్థాల నిర్వహణలో విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించిన నేపథ్యంలో, ఈ సమావేశంలో కమిషనర్ నగరంలో అమలు చేస్తున్న పారిశుధ్య, చెత్త సేకరణ, తడి-పొడి వ్యర్థాల వేరు నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, శాస్త్రీయ వ్యర్థాల ప్రాసెసింగ్ విధానాలను సమగ్రంగా వివరించారు.
ప్రత్యేకంగా మూలస్థాయిలోనే వ్యర్థాల వేరు సేకరణ, తడి చెత్తను వర్మీ కంపోస్ట్ రూపంలో మార్చడం, నగర పార్కులు మరియు హరిత ప్రదేశాల్లో ఆ సేంద్రియ ఎరువుల వినియోగం, నిర్మాణ వ్యర్థాలతో నిర్మాణ వస్తువుల తయారీ, కొబ్బరి వ్యర్ధాలతో కోకోపిట్, కొబ్బరి పీచు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వాహణ వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అధికారులు ప్రశంసలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉత్తమ పారిశుధ్య నిర్వహణ పద్ధతులను అమలు చేస్తున్న వివిధ స్థానిక సంస్థలు తమ అనుభవాలు, వినూత్న విధానాలను ఈ సమావేశంలో పంచుకున్నాయి. వాటిని అధ్యయనం చేసి విజయవాడలో కూడా మరింత సమర్థవంతమైన విధానాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జి) పి. సత్యకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News