అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని, బుధవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు జిల్లా గూడూరులో 44.9°C, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 23 జిల్లాల పరిధిలోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, నెల్లూరులో 25, ప్రకాశంలో 23, మార్కాపురంలో 20, కృష్ణాలో 18, తిరుపతిలో 17, నంద్యాలలో 14, ఎన్టీఆర్ లో 13, బాపట్లలో 13, విజయనగరం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వివరించారు.
మే 20 బుధవారం
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
• నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
• అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C – 43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
అలాగే రేపు శ్రీకాకుళం జిల్లాల్లో 18 మండలాలు, విజయనగరం 6, పోలవరం 4, విశాఖ 4, అనకాపల్లి 20, కాకినాడ 9, కోనసీమ 7, పశ్చిమగోదావరి1, ఏలూరు 1, కృష్ణా 1 మొత్తంగా 71 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 277 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/0cd68b560e3f1b3cb6387332ec4b03d2.pdf
మంగళవారం పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి) పెదచెర్లోపల్లిలో 44.2°C, ప్రకాశం(జి) సంతనూతలపాడులో 44.1°C, బాపట్ల(జి) ఇంకొల్లులో 43.2°C, ఎన్టీఆర్(జి) కంచికచర్లలో 43.1°C, గుంటూరు(జి) పాండ్రపాడులో 43°C, నంద్యాల(జి) సంజామలలో 42.9°C, అనకాపల్లి(జి) దేవరాపల్లి 42.8°C, తూర్పు గోదావరి (జి) బ్రాహ్మణగూడెం, మన్యం(జి) సాలూరు, తిరుపతి(జి) బోనుపల్లె, వైఎస్సార్ కడప(జి) ఒంటిమిట్టలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరోవైపు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Prajavartha Online Telugu News