– తద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు
– పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం
జియో ట్యాగింగ్ తో రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్
– పల్లె పండుగ 1, 2 ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన
– గిరిజన ప్రాంతాలకు మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరణ
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే 2వ విడతలో 2,750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం. మొదటి విడతలో 22,500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గానూ 22,514 పూర్తి చేశాం. రెండవ విడతలో 15 వేల లక్ష్యానికి గానూ 15,303 గోకులాలు నిర్మించాం. పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల లక్ష్యానికి గానూ 15,188 నీటి తొట్టెలు నిర్మించాం. మొదటి విడతలో 20 వేల ఫార్మ్ పాండ్స్ లక్ష్యానికి గానూ 21 వేలు పూర్తి చేశాం. రెండవ విడతలో ఈ పనులను భారీగా పెంచి, 81 వేలు లక్ష్యానికి గానూ 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించాం. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.
• మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరించాలి
గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలి. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి, అక్కడి భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలి. కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పనులు చాలా కాలం మన్నేలా, శాస్త్రీయంగా ఉండటం కోసం నిపుణులైన ఇంజనీర్లు, పారిశుధ్యం-ప్రజారోగ్య నిపుణులు సలహాలు, సూచనలు కచ్చితంగా తీసుకోవాలి.
• రోడ్ల నాణ్యతపై రాజీపడొద్దు
గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. నాణ్యత లోపిస్తే సహించేది లేదు. సీసీ రోడ్డు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా, మట్టితో పక్కాగా వాలు చేయాలి. వాలు చేయకుండా వదిలేస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశంతోపాటు వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్డు అంచులు త్వరగా పాడైపోతాయి. పల్లె ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చాం. రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్ కు చెక్ పెట్టేందుకు ఈ డిజిటల్ పద్ధతి సహాయపడుతుంది. ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎంతవరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్, జియో-ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చు. ప్రజలు కూడా రోడ్ల యొక్క ప్రస్తుత స్థితిగతులను ఆన్లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
• నిర్దేశించిన పనులకే అనుమతులు
ఉపాధి హామీ నిధులను ప్రభుత్వ నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరు చేయాలి. అంతకు మించి అదనంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ లెక్కలకు, క్షేత్రస్థాయి ఖర్చులకు పొంతన లేకుండా పోయి నిధుల దుర్వినియోగానికి, ఆడిట్ ఇబ్బందులకు దారితీస్తుంది. అలాగే ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన పనులను మాత్రమే గ్రామాల్లో చేపట్టాలి. ప్రభుత్వ నిబంధనల జాబితాలో లేని ఎలాంటి ఇతర పనులను ఉపాధి హామీ కింద చేయడానికి వీలు లేదు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రామ్ జీ) చట్టాన్ని స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల”ని చెప్పారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News