-పెరుగుతున్న ఎండ తీవ్రత కనుగుణంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్న ఎండ తీవ్రత దృశ్య రానున్న వారం రోజుల్లో ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు రావద్దని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విన్నవించారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలకు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి, ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజలకు వడదెబ్బ తగలకుండా నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు “డూ’స్ అండ్ డోంట్స్” కరపత్రాలు, సోషల్ మీడియా, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా బస్ స్టాండ్లు, మార్కెట్లు, ట్రాఫిక్ జంక్షన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లు, అధిక రద్దీ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు, చలివేంద్రాలు, తాత్కాలిక నీటి కియోస్కులు, షేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 104 చలివేంద్రాలను సమీక్షించి అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే ప్రధాన రహదారులు, ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మిస్ట్ వాహనాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు కొనసాగించాలని తెలిపారు. ప్రతి అన్నా క్యాంటీన్ క్యూ లైన్ వద్ద కచ్చితంగా నీడను ఏర్పాటు చేయాలని, నగరంలోని ఉద్యానవనాలు, ఆట స్థలాలకు ఉదయం 9 గంటల తర్వాత మరియు సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు, ముఖ్యంగా వాకర్లు రాకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
వృద్ధులు, నిరాశ్రయులు, వీధి వ్యాపారులు, పారిశుద్ధ్య కార్మికులు, నిర్మాణ కార్మికుల పై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. వార్డు స్థాయిలో అవసరమైన ORS ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే పనులు, పారిశుద్ధ్య కార్యకలాపాలు, డీసిల్టింగ్, నిర్మాణ పనులు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పారిశుద్ధ్యం, నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, లీకేజీలను వెంటనే మరమ్మతు చేయాలని, క్లోరినేషన్, నీటి నాణ్యత పరీక్షలను నిరంతరం నిర్వహించాలని కమిషనర్ తెలిపారు. హీట్ వేవ్‌కు సంబంధించిన ఫిర్యాదులు, అత్యవసర పరిస్థితుల పరిష్కారానికి కంట్రోల్ రూములు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.
జంతువులు, పక్షుల రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. పార్కులు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో పక్షులకు నీటి పాత్రలు, జంతువులకు తాగునీటి తొట్లు ఏర్పాటు చేసి వాటిని క్రమం తప్పకుండా నింపేలా చూడాలని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలు, సచివాలయాల్లో కూడా పక్షులకు నీటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రతిరోజూ పరిస్థితులను పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. హీట్ వేవ్‌కు సంబంధించిన ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, డాక్టర్ డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్లు కే.షమ్మీ, కే ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె. శ్రీనివాస్, ఏ శ్రీనివాసరెడ్డి, జి సామ్రాజ్యం, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు అన్నపూర్ణ,గోపాల్ నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి హరీష్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News