-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో చేపడుతున్న డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, రామలింగేశ్వర నగర్ తదితర ప్రాంతాలను పర్యటించి జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా కృష్ణవేణి స్కూల్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యే నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఔట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. ఈ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి వర్షపు నీరు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా ప్రవహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యమని కమిషనర్ తెలిపారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.
తదుపరి కమిషనర్ రామలింగేశ్వర నగర్ కట్ట రోడ్డు, బెంజ్ సర్కిల్ మీదుగా కనకదుర్గమ్మ వారధి వరకు పర్యటించి నగర సుందరీకరణ, హరితాభివృద్ధి పరిశీలించారు. నగరంలో హరితాన్ని మరింత పెంచి ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ప్రధాన రహదారులు, డివైడర్లు, ఖాళీ ప్రదేశాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే. షమ్మీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. సామ్రాజ్యం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News