-కలెక్టర్ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేసిన డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సాధికారత, స్వయం ఉపాధి లక్ష్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్ఫూర్తితో, గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. P4 పథకంలో భాగంగా, సాయం కోరిన బంగారు కుటుంబం’ లక్ష్యంతో ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త కాటూరి రమేష్ మార్గదర్శిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఉచిత బ్యూటీషియన్ శిక్షణ తరగతులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. గత 45 రోజుల చొప్పున రెండు బ్యాచ్‌లలో మొత్తం 50 మంది మహిళలు, యువతులకు అత్యుత్తమ శిక్షణ అందించారు.
కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ శిక్షణ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఇందులో భాగంగా ‘రూతు’ అనే మహిళ ప్రయాణం అందరికీ ఆదర్శం. అభద్రతాభావం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న సాయం కోరిన బంగారు కుటుంబం’ నేపథ్యం నుండి వచ్చిన ఆమె, ఒకానొక దశలో ఎంతో ఆవేదనకు లోనయ్యారు. అటువంటి సమయంలో గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆమెకు అండగా నిలిచింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆమెలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బ్యూటీషియన్ వృత్తిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఆ శిక్షణ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పేదరికంలో సతమతమైన ఆమె, క్రమంగా నైపుణ్యం సంపాదించి ఇప్పుడు ఒక ‘టీచర్’గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె మరో 50 మందికి శిక్షణ ఇస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, తానూ ఇతరులకు మార్గదర్శిగా మారి, మహిళా సాధికారతకు నిలువుటద్దంగా నిలుస్తున్నారు.
Prajavartha Online Telugu News