-ప్రజల ప్రాణ రక్షణ ప్రధాన లక్ష్యంగా పని చేయండి
-ఏ రూపంలోనూ నిర్లక్ష్యం అనేది కనిపించకూడదు
-ఎక్కడా తాగునీటి కొరత అనే మాట రాకూడదు
-చలివేంద్రాలు క్రియాశీలంగా ఉండాలి
-ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కడికక్కడ ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలి
-డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ తప్పనిసరి
-సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ టెలీ కాన్ఫరెన్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు ప్రభావం దృష్ట్యా జిల్లాలో ప్రతి శాఖ అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వేసవి పరిస్థితులు, తాగునీటి సరఫరా, హీట్‌వేవ్ నివారణ చర్యలపై బుధవారం కలెక్టరేట్ నుంచి పంచాయతీరాజ్, మునిసిపల్, రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా, డ్వామా తదితర శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత అనే మాట వినిపించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలలో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తకుండా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం కనిపించకూడదన్నారు.
ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఏర్పాటు చేసిన చలివేంద్రాలు పూర్తిస్థాయిలో క్రియాశీలంగా ఉండాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ శ్రామికులకు తాగునీరు, మజ్జిగ, నీడ, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హీట్‌వేవ్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, ప్రజా ప్రదేశాలలో సూచనలు ఉన్న ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు పరిధిలో మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పశుపక్ష్యాదులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఆర్డీవోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News