-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-లేపాక్షి షో రూమ్ లకు నూతన హంగులు
-ఢిల్లీ, కాకినాడ షో రూమ్ లకు మరమ్మతులు
-రాజమండ్రి ఎయిర్ పోర్టులో నూతన షో రూమ్ ఏర్పాటు
-హస్త కళాకారులకు 365 రోజుల ఉపాధే లక్ష్యం
-ఏపీహెచ్డీసీ అధికారులతో సమీక్షలో మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయడంతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా వేదికగా కళారూపాలను నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. హస్త కళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. లేపాక్షి షోరూమ్ లు, హస్తకళా రూపాల విక్రయాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీహెచ్డీసీ) అధికారులతో బుధవారం మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొని, రాష్ట్రంలో నూతన లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న షో రూమ్ లను వినియోగదారులకు ఆకట్టుకునేలా అభివృద్ధి చేసే అంశాలపై మంత్రి సవితకు వివరించారు. మరమ్మతులు పూర్తిచేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షో రూమ్ లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మరమ్మతులు పూర్తి చేసుకున్న లేపాక్షి షో రూమ్ లను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో నూతన లేపాక్షి షో రూమ్ ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపిందని, త్వరగా ఆ షో రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని లేపాక్షి షో రూమ్ లను నూతన హంగులతో వినియోగదారులకు ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలన్నారు. ఈ కామర్స్ ద్వారా హస్త కళారూపాల అమ్మకాలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా వేదికను హస్త కళారూపాల విక్రయాలకు అవకాశంగా వాడుకోవాలన్నారు. నేరుగా వినియోగదారుల ఇళ్లకే కళారూపాలను డోర్ డెలివరీ చేసేలా ఈ కామర్స్ వేదికలను వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే ఆప్కో షో రూమ్ ల ద్వారా చేనేత వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న హస్త కళాకారులకు ఏడాది పాటు ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా హస్త కళారూపాల అమ్మకాలు పెంచేలా అధికారులు ప్రణాళికలు అమలుచేయాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News