Breaking News

కొత్త స్టార్ట‌ప్‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వ ప్రోత్స‌హ‌కాలు

– మంత్రి కొండ‌ప‌ల్లిని క‌లిసిన ఎస్కేయు ప్ర‌తినిధులు
– ప‌లు కొత్త స్టార్ట‌ప్‌ల‌పై చ‌ర్చ‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొత్త‌ ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడంలో కూట‌మి ప్ర‌భుత్వం ఎప్పుడూ ముందుంటుంద‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ – శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (AIC-SKU) సీఈఓ డాక్టర్ సి. చంద్రమౌళి, డాక్టర్ పి. జ్యోతి మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా AIC-SKU చేపట్టిన కార్యక్రమాలు మరియు సాధించిన విజయాలపై వారు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఇప్పటివరకు 70 కి పైగా స్టార్టప్‌లను ప్రోత్సహించ‌డంతో పాటు 50 ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు స‌పోర్ట్ చేసింద‌ని వారు మంత్రికి వివ‌రించారు.
ఈ ప్రజెంటేషన్‌లో క్లీన్ వాటర్ టెక్నాలజీస్, వ్యర్థాల నిర్వహణ, వ్య‌వ‌సాయం, పునరుత్పాదక ఇంధనం, బయోమెడికల్ పరికరాలు, ఏఐ (AI) ఆధారిత పరిష్కారాలు వంటి రంగాల‌లో విజ‌య‌వంత‌మైన స్టార్ట‌ప్‌ల గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించారు. AIC-SKU లో అభివృద్ధి చెందిన కొన్ని స్టార్ట‌ప్‌లు గ్రాంట్లు, పేటెంట్లు, పెట్టుబడులతో పాటు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయ‌ని వారు తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ హబ్‌లెస్ సైకిల్‌ను అభివృద్ధి చేసిన హెలెన్ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఆవిష్కరణను కూడా ఈ బృందం ప్రదర్శించింది. దీంతో పాటు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంస‌లు అందుకున్న అవన్ టెక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన నీటి పొదుపు సాంకేతికతను వారు ప్రదర్శించారు. ఈ నీటి పొదుపు సాంకేతికతను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడానికి వీలుగా ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి వారికి సూచించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ESDP) కింద సాంకేతిక‌త‌ను మ‌రింత‌గా ముందుకు తీసుకువెళ్లాల‌ని మంత్రి సూచించారు. వ్యవసాయ వ్యర్థాల ఆధారిత ‘బయోడ్రాప్స్’ కంపోస్టింగ్ ఎక్కువ మందికి చేరేలా చేయ‌డం కోసం బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ముందుకు తీసుకెళ్లవచ్చని మంత్రి సూచించారు. అలాగే స్వర్ణాంధ్ర – వికసిత్ భారత్ @2047 విజన్‌కు అనుగుణంగా స్టార్టప్‌ల‌ను బలోపేతం చేయడంలో AIC-SKU చేస్తున్న కృషిని మంత్రి కొండ‌ప‌ల్లి అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *