-ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు
-ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అధికారులు పని చేయాలి
-రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని,ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మైన్స్ అండ్ జియాలజీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనింగ్‌కు సంబంధించి గత ఐదేళ్లలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు, పర్మిషన్స్ (ఈసీ పర్మిషన్స్ వంటివి) త్వరితగతిన ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనింగ్ రంగంలో ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా ఇసుకకు సంబంధించి గత 5 ఏళ్లలో వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ, ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి సంవత్సరం సగటున ప్రభుత్వానికి రావాల్సిన 300 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయినా, ప్రజలకు ఇసుక సరఫరా లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ఎన్జీటీ పర్మిషన్స్ ఇవ్వడంలో, ఈసీ పర్మిషన్స్ ఇవ్వడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మైనింగ్ లో “వ్యాల్యూ ఎడిషన్ (Value addition) కి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు సంబంధించి ఇవాళ భారతదేశంలో వచ్చిన పెట్టుబడులలో 25% పెట్టుబడులు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. గూగుల్ (Google), ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal), మొన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ పుట్టపర్తి లో రక్షణ రంగానికి చెందిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు.కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ, రిలయన్స్ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మైనింగ్ రంగ అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ ఇసుకకు సంబంధించి జిల్లాలో 5 ఓపెన్ రీచ్ లు, 5 డీసిల్టేషన్ పాయింట్స్ ఉన్నాయన్నారు. ఓపెన్ రీచ్ లు అన్నీ పని చేస్తున్నాయని, డీసిల్టేషన్ పాయింట్స్ కూడా పని చేస్తున్నాయన్నారు. ఓపెన్ రీచ్ ల దగ్గర దాదాపు 3 టన్నుల ఇసుక ఉందన్నారు. కాబట్టి జిల్లాలో ఇసుక కొరత సమస్య ఏమీ లేదన్నారు. డీసిల్టేషన్ పాయింట్స్ వద్ద కూడా ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఎండ కాలంలో కూడా డీసిల్టేషన్ పాయింట్స్ లో వర్క్ జరుగుతుంది కాబట్టి, టార్గెట్ చేసినంత ఇసుక పరిమాణాన్ని పొందగలమని కలెక్టర్ తెలిపారు. జూన్ 1 వ తేది నుండి అక్టోబర్ 15 వ తేదీ వరకు 6 లక్షలు టన్నుల ఇసుక అందుబాటులో ఉండాలని టార్గెట్ ఇచ్చారని, కానీ 12 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. కాబట్టి కర్నూలు జిల్లాలో ఇసుక సరఫరాకు ఎటువంటి సమస్య లేదన్నారు. నంద్యాల జిల్లాకు కూడా రెండు డిపోల ద్వారా ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. ఒకటి ఆత్మకూర్ మరియు ఇంకొకటి నందికొట్కూరు అని తెలిపారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను సీజ్ కూడా చేయడం జరిగిందన్నారు..
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ
జిల్లాల విభజన జరిగిన తర్వాత, మేజర్ మినరల్స్ (ముఖ్యమైన ఖనిజాలు) నంద్యాల జిల్లాకు వెళ్ళాయన్నారు. చిన్న చిన్న సిమెంట్ ఫ్యాక్టరీలు మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నారు. ఇసుక అందుబాటులో ఉందని ఎలాంటి సమస్య లేదన్నారు. అన్ని రీచ్‌లు కూడా ఇప్పుడు ఫంక్షనింగ్‌లో ఉన్నాయన్నారు. రానున్న 3 నెలలకు స్టాక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎప్పుడైనా ఫిర్యాదులు వస్తే, వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశంలో టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మంత్రాలయం టీడీపీ పార్టీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఇంచార్జి డిడి మైన్స్ నాగిని, గనుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News