అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నగరాన్ని అందరికీ అందుబాటులో ఉండే, సమగ్రమైన రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) 2026 మే 21న రాయపూడిలో APCRDA ప్రాజెక్టు కార్యాలయంలో “డెవలపింగ్ అమరావతి యాజ్ ఏ మోడల్ సిటీ ఆఫ్ యాక్సెసిబిలిటీ & ఇన్‌క్లూజన్” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ఆర్కిటెక్టులు, ప్లానర్లు, ఇంజినీర్లు, కన్సల్టెంట్లు, సంబంధిత రంగంలోని నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అందరికీ సౌకర్యవంతంగా, సమాన అవకాశాలు కల్పించేలా యూనివర్సల్ డిజైన్, యాక్సెసిబిలిటీ, ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్ సూత్రాలను అమరావతి నగర అభివృద్ధిలో భాగం చేయడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యం.
APCRDA చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్ వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ యాక్సెసిబిలిటీ అనేది కేవలం నిబంధనల అమలులో మాత్రమే కాకుండా, మానవతా దృక్పథంతో కూడిన స్థిరమైన పట్టణాభివృద్ధిలో కీలక భాగమని తెలిపారు. నగర ప్రణాళిక ప్రారంభ దశ నుంచే సమగ్ర అభివృద్ధి సూత్రాలను అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ఈ వర్క్‌షాప్‌లో LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, సుర్బానా జురాంగ్, DP ఆర్కిటెక్ట్స్ సింగపూర్, ది అర్బనైజర్, ఏకాంశ్ ట్రస్ట్ తదితర సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని ఇన్‌క్లూజివ్ జోనింగ్ రెగ్యులేషన్స్, యూనివర్సల్ యాక్సెసిబిలిటీ, బ్యారియర్ ఫ్రీ మౌలిక వసతులు, అందుబాటులో ఉండే రహదారులు, మొబిలిటీ వ్యవస్థలు, యాక్సెసిబిలిటీ ఆడిట్ విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.
LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ బ్యూలా క్రిస్టీ, కిరణ్ కుమార్ దివ్యాంగులకు అనుకూలమైన ప్రజా మౌలిక వసతుల అవసరాన్ని వివరించారు. గ్రెయిల్‌మేకర్ ఇన్నోవేషన్స్ సహ వ్యవస్థాపకురాలు టీవీ ఐశ్వర్య గారు దృష్టి లోపం ఉన్న వ్యక్తులు పట్టణాల్లో ఎదుర్కొనే సమస్యలను వివరించడంతో పాటు “స్పేస్‌ఫెల్ట్” అనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ గురించి వివరించారు.
ఏకాంశ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అనిత అయ్యర్ నారాయణ్ యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల మానవ జీవితంపై, స్వతంత్ర జీవనం తదితర అంశాలపై పడే ప్రభావాన్ని వివరించారు. సుర్బానా జురాంగ్, DP ఆర్కిటెక్ట్స్ సింగపూర్ & ఇతర అంతర్జాతీయ ప్రణాళిక బృందాలకు చెందిన నిపుణులు సమగ్ర పట్టణాభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
భారతదేశంలో యాక్సెసిబిలిటీ, సమగ్రత, మానవ కేంద్రిత పట్టణాభివృద్ధికి అమరావతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా కార్యాచరణపై చర్చలతో ఈ వర్క్‌షాప్ నిర్వహించబడింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమగ్రమైన, ప్రపంచ స్థాయి ఆధునిక వసతులు కలిగిన ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణానికి APCRDA కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News