– బంగారు కుటుంబాల ప్రగతికి చేయూతనందిస్తున్న మార్గదర్శులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలనే గొప్ప లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన పీ 4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముందుకెళ్తోంది. గతేడాది రాష్ట్రంలోనే తొలిసారిగా నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలో బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. అది మొదలు కేవలం ఆర్థిక సహాయం అందించి ఊరుకోవడమే కాదు.. ఓ పేద కుటుంబాన్ని పేదరికం నుంచి పూర్తిగా బయటపడే వరకు, ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో సగర్వంగా నిలబడేవరకు మార్గదర్శులు.. బంగారు కుటుంబాలకు చేయూతనిస్తున్నారు. ఈ క్రమంలోనే సెంటిని బయో ప్రొడక్ట్స్ సంస్థ ద్వారా కొండ్రు వెంకటరావమ్మ బంగారు కుటుంబానికి ఇప్పటికే ఆటో, కుట్టుమిషన్ అందించడంతోపాటు పిల్లల చదువుకు ఆసరా లభించింది. ఈ కుటుంబానికి ముఖ్యమంత్రి హామీతో ప్రభుత్వం అందించిన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సెంటిని బయో ప్రొడక్ట్స్ సంస్థ రూ. 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. గురువారం కలెక్టర్ లక్ష్మీశ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కొండ్రు వెంకటరావమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానించి, సమాజంలో ఉన్నతంగా ఎదిగే వరకు మార్గదర్శుల ద్వారా సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు. పీ4 అనేది ఓ వినూత్న కార్యక్రమమని.. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో సెంటిని బయో ప్రొడక్ట్స్ సంస్థ యాజమాన్యానికి చెందిన కె.శ్రీవల్లి, జనరల్ మేనేజర్ కె.మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News