గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వీస్తున్న వడ గాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ కోరారు. ఈ మేరకు గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి తీవ్రత అధికంగా ఉందని, 54 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ వేడిమి ఉండవచ్చని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో, ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్న చోట నీడ ఏర్పాటు చేయాలనీ సూచించారు. సురక్షితమైన తాగు నీటిని ఏర్పాటు చేయాలనీ, ప్రధానంగా బస్సు స్టాండ్స్, మార్కెట్ కూడళ్ళలో, ఆసుపత్రులు, వృద్ధులకు, పారిశుధ్య కార్మికులు పని చేసే చోట, తోపుడు బళ్ళుపై విక్రయించేవారికి, బయట నివసిస్తున్న వారికీ తగు జాగ్రత్తలు తెలియజేయాలని అన్నారు.
అన్ని సచివాలయాల్లో తాగు నీరు, అత్యవసర మందులు, ఓ.ఆర్.ఎస్ వంటివి సిద్ధంగా ఉంచాలన్నారు. పక్షులు, జంతువుల కోసం పశు సంవర్ధక శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో వేసవి తీవ్రత పట్ల మండల ప్రత్యేక అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. తాగు నీరు ఎక్కడా కలుషితం కాకుండా చూడాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉండి ఎటువంటి పరిస్థితులలోనైనా వైద్య సేవలు అందించాలని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలనీ, ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.
Tags guntur
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News