కంచికచర్ల న్యూ అంబేద్కర్ కాలనీ త్రాగునీటి కష్టాలు తీరేదెన్నడు..??

-త్రాగునీరు సమస్య పరిష్కారానికై పంచాయతీ ఈవో ప్రియాంకను కలిసిన న్యూ అంబేద్కర్ కాలనీవాసులు

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
కంచికచర్ల న్యూ అంబేద్కర్ కాలనీ వాసులు శుక్రవారం తమ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ ఈవో ప్రియాంకను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. అనంతరం న్యూ అంబేద్కర్ కాలనీవాసి, ప్రముఖ దినపత్రిక సూర్య జర్నలిస్ట్ అయిన అమర్లపూడి రాజు మాట్లాడుతూ కంచికచర్ల గ్రామంలోని న్యూ అంబేద్కర్ కాలనీ వాసులకు త్రాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమైనట్లు తెలియజేశారు. గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వాసులు గత 30 సంవత్సరాలుగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులకి ఒకసారి లేదా 30 రోజులకు ఒకసారి మాత్రమే త్రాగునీటిని పంచాయతీ పంపుల ద్వారా పంచాయతీ వారు వదులుతున్నారని ఆ నీరు కూడా మురికిగాను, దుర్వాసనతోనూ ఉండి త్రాగడానికి వీలు లేకుండా ఉంటున్నాయని అన్నారు. ఈ సమస్యపై గత 30 సంవత్సరాల నుంచి పలుమార్లు సమస్య పరిష్కారానికై సంబంధిత అధికారులకు, పంచాయతీకి అనేకమార్లు అర్జీలు ఇచ్చిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రమే తమ కాలనీకి వస్తారని ఆ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అనేక రకాల ఆశలు చూపించి ప్రజలను లోబరుచుకొని కేవలం ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకొని అనంతరం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపరని, స్వయంగా ప్రజలే నాయకుల దగ్గరకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించమని అడిగినా కూడా రేపో మాపో చేస్తామని కేవలం మాటలకే పరిమితమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ త్రాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి అధికారులు, నాయకులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారాన్ని ఆచరణలో పెట్టాలని, అప్పటి వరకు తాత్కాలికంగా వేసవి తాపాన్ని తీర్చే విధంగా మినీ ట్యాంకర్లతో అయినా త్రాగునీటిని న్యూ అంబేద్కర్ కాలనీ వాసులకు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డోలు చంటి, ఎస్.మధు, ఏ.రాజు, అమ్ములు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *