-మెటల్ రహదారిని ప్రారంభించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ,
-మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని.. ఒక గ్రామానికి మంచి రహదారి ఉంటే ఆ గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ.. శనివారం వత్సవాయి మండలం, లింగాలలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), , ప్రాంత నాయకులు తదితరులతో కలిసి రూ. 1.19 కోట్లతో ఏర్పాటుచేసిన డబ్ల్యూబీఎం మెటల్ రహదారిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ లింగాల నుంచి వత్సవాయి వెళ్లేందుకు డొంకల మార్గాలను అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన ఈ రహదారి ఉపయోగపడుతుందని.. అదేవిధంగా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వ్యవసాయ పనులతో పాటు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తరలించేందుకు గ్రామీణ రహదారులు ఎంతో దోహదపడుతున్నాయి. గ్రామీణ రహదారులు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాకుండా గ్రామాభివృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు, సామాజిక మార్పుకు బలమైన పునాది అని చెప్పవచ్చని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, నందిగామ ఆర్‌డీవో అనిల్ కుమార్, స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News