-ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్
-మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే కార్యక్రమం లక్ష్యం
-4 వారాలపాటు నిర్వహించే కార్యక్రమాన్ని బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు
-పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చిన మంత్రి
-డివైడర్లకు పెయింటింగ్ వేసి, మొక్కలు నాటిన మంత్రి
-అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్‌యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ వ్యవహారాల శాఖ నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని సాంబమూర్తి రోడ్డులో గల కూర్మయ్య బ్రిడ్జి వద్ద నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి పి. నారాయణ, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే. పట్టాభిరామ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి. అనిల్ కుమార్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి.సమరం లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ… ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారన్నారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో వారంలో ఇళ్ళు, కమర్షియల్ సంస్థల వద్ద చెత్త వర్గీకరణ (సెగ్రిగేషన్)పై అవగాహన కల్పిస్తారు. నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 అక్టోబర్ 2 న మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రతి మూడో శనివారం ఒక జిల్లాను సందర్శిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో వదిలేసిన సుమారు 153 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలలో, గ్రౌండ్ పైన ఉన్న 85 లక్షల టన్నుల చెత్తను అధికారులు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2025 అక్టోబర్ 2 నాటికి ఏడాదిలోనే తొలగించారు. మిగిలిన భూగర్భ చెత్తను కూడా వచ్చే జూన్ చివరి నాటికి పూర్తిగా క్లియర్ చేసే దిశగా వేగంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్‌గా మార్చే “వేస్ట్ టు ఎనర్జీ” ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రస్తుతం విశాఖపట్టణం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా, మరో ఆరు ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇవి రాబోయే రెండేళ్లలో పూర్తై చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నాయన్నారు.
అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచారన్నారు. వచ్చే నెల జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో డంప్‌యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో స్వచ్చాంధ్ర ఉద్యమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా అమలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను పరిశుభ్రతలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేస్తూ, 2000 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రానికి ఐదు అవార్డులు లభించాయని, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్చ సూపర్ లీగ్‌లో స్థానం సంపాదించుకోవడం సంతోషకరమని పేర్కొంటూ, స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర లక్ష్య సాధనకు అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు.
స్వర్ణాంధ్ర సాధనలో స్వచ్ఛాంధ్ర కీలక పాత్ర పోషిస్తుందని మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ… విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కేవలం పారిశుధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో 3600 మంది శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్నారని, వారికి ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలని సూచించారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రెడ్, ఎల్లో స్పాట్ల నిర్మూలన, డ్రైన్ల శుభ్రత, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. బహిరంగ మూత్ర విసర్జన నివారణకు వినూత్న చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు, వ్యాపారులు, బల్క్ వేస్ట్ జనరేటర్లు అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే విజయవాడను మరింత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దగలమని సురేష్ కుమార్ పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. వ్యాపారులు, విద్యా సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీవోలు, యువతతో పాటు సమాజంలోని ప్రతి వర్గం పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడి, వారి ఆదాయం పెరిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమర్థవంతంగా అమలు చేయాలంటే ముందుగా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు టెర్రస్ గార్డెన్ గ్రూపులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నగర ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News