గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలో వీధి కుక్కల సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించేందుకు మరియు ప్రజలకు, జంతు ప్రేమికులకు మధ్య ఘర్షణ వాతావరణాన్నినివారించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, నగరంలో వీధి కుక్కలకు రెగ్యులర్‌గా ఆహారం అందించే (డాగ్ ఫీడర్స్) వారి సౌకర్యార్థం మరియు పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన “డాగ్ ఫీడింగ్ షెడ్ లను” జిఎంసి అందుబాటులోకి తెచ్చిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఆహారం వేయడం వల్ల పారిశుధ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, కుక్కలు గుంపులుగా చేరి స్థానిక ప్రజలపై, ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు పాదచారులపై దాడులు చేసే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా తొలివిడతగా నగరంలోని రామిరెడ్డి నగర్, మరియు ఏటి అగ్రహారం పరిధిలోని పలు కీలక ప్రాంతాలలో ఈ ప్రత్యేక డాగ్ ఫీడింగ్ షెడ్ లను పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివాస ప్రాంతాలలో వీధి కుక్కల సంచారం మరియు దాడుల తీవ్రతను తగ్గించడంతో పాటు రోడ్లపై ఆహార వ్యర్థాలు పేరుకుపోకుండా, దోమలు మరియు ఈగలు ప్రబలకుండా నివారించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జంతు ప్రేమికులు మరియు నగర ప్రజలు ఎవరైనా వీధి కుక్కలకు ఆహారం లేదా నీరు అందించాలని అనుకుంటే, దయచేసి బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై వేయకుండా, కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సదరు షెడ్ లలోనే ఆహారాన్ని అందించాలని కోరారు. దీనివల్ల కుక్కలు ఒకే చోట క్రమశిక్షణతో ఆహారం అలవాటు చేసుకుంటాయని, తద్వారా వీధుల్లో తిరిగే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేదా భయాందోళనలు కలగవని తెలిపారు. ప్రజలు జిఎంసి తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించి గుంటూరు నగరాన్ని సురక్షితమైన, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కోరారు.
Prajavartha Online Telugu News