-రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్
బాపులపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే, గ్రౌండు ట్రూతింగు, విలేజ్ సర్వేయర్ లాగిన్, ఈ-కె వై సి ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో గ్రౌండు ట్రూతింగు, వేలేరు మరియు వీరవల్లి గ్రామాల సర్వేయర్ లాగిన్ లో జరుగుతున్న డేటా ఎంట్రీ లను క్షేత్రస్థాయిలో రీ-సర్వే పనులను డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే సిబ్బంది చేస్తున్న గ్రౌండు ట్రూతింగు, ఈ-కేవైసీ ప్రక్రియలను దగ్గరుండి గమనించిన డైరెక్టర్, అక్కడ ఉన్న రైతులు, రెవిన్యూ, సర్వే సిబ్బందితో ముఖాముఖి మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక, భూ సమస్య లపై సుదీర్ఘంగా సమీక్షించారు. “రీ-సర్వే” ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని చెప్పడానికి నిదర్శనంగా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో రాష్ట్ర డైరెక్టర్ కూర్మనాధ్ సమక్షంలోనే సిబ్బంది రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. తమ కళ్ళ ముందే తమ సమక్షంలో అధికారులు సర్వే చేస్తుండటం పై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతులకు ఖచ్చితమైన భూహక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవిన్యూ, సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు.
క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో , మల్టీ జోన్ -1 అర్జెడి Ch.V.S.N.కుమార్ , జిల్లా సర్వే సహాయ సంచాలకులు లక్ష్మణ రావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ ఆఫ్, మచిలీపట్నం , బాపులపాడు మండల తహశీల్దారు బి.మురళీకృష్ణ , మండల సర్వేయరు సిహెచ్. ఫణికుమార్ తో పాటు స్థానిక రెవిన్యూ, సర్వే సిబ్బంది, పెద్ద ఎత్తున రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News