Breaking News

మోడీ ప్రభుత్వం పదేపదే పెట్రో ధరలు పెంచడం దుర్మార్గం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మోడీ ప్రభుత్వం పదే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై గుదిబండ మోపడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగుసార్లుగా రూ.8 లకుపైగా పెంచింది. ప్రజలపై ధరల భారం మోపడమే పనిగా పెట్టుకుంది. నేడు నాలుగో దఫా పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 పెంచటం దుర్మార్గం. విపరీతంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుంది.
పెట్రో ధరలు విపరీతంగా పెంచాలనే యోచనతోనే ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలంటూ ప్రధాని మోడీ కుంటి సాకులు చెప్పారు. 2014లో ఇప్పటికంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 109 డాలర్లు ఉండగా, పెట్రోల్ లీటర్ ధర రూ.57లుగా ఉండేది. 2026లో బ్యారెల్ ముడిచమురు ధర 106 డాలర్లుగా ఉన్నప్పటికీ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 117 రూపాయలకు పైగా చేరింది. 2014 కంటే క్రూడ్ ఆయిల్ ధరలు నేడు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్, డీజిల్ రేట్లు రెట్టింపుకు చేరాయి. 2020 కోవిడ్ కాలంలో బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం రూ.37.63కి పడిపోయింది. ముడి చమురు ధరలు మూడో వంతుకు పడిపోయినప్పటికీ మోడీ ప్రభుత్వం మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు ఏమాత్రం తగ్గించలేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారేగాని తగ్గినప్పుడు మాత్రం తగ్గించిన పాపాన పోలేదు. అంతేకాకుండా పెట్రో ఉత్పత్తులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తామేమీ తీసిపోమన్నట్లుగా ఎపీ ప్రభుత్వం అధిక పన్నులు, సుంకాలు వడ్డిస్తూ ప్రజల నడ్డి విరుస్తోంది. గతంలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు ఏమాత్రం తగ్గించని కేంద్రం, యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మరింత పెంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనినిబట్టి ప్రజా శ్రేయస్సు, సంక్షేమంపట్ల మోడీ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదనేది బహిర్గతమవుతోంది.
డాలర్‌తో రూపాయి విలువ దిగజారింది. 2014లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.60లుగా ఉండగా, నేడు రూ.96.80 పైసలకు చేరింది. 2014 నుండి రూపాయి విలువ బలహీన పడటానికి మోడీ ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలే కారణం. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చటం వల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతున్నామనే సత్యాన్ని కేంద్రం చెప్పకుండా అమెరికా`ఇరాన్ యుద్ధాన్ని బూచిగా చూపిస్తోంది. 2014 నుండి ఇప్పటివరకు పెట్రోధరలను పెంచి రూ.30 లక్షల కోట్లు ఆర్జించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ రూ.30 లక్షల కోట్లు ఎటుపోయాయో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డీజిల్, పెట్రోల్ రేట్లను అడ్డం పెట్టుకుంటున్నాయి. అందుకోసమే మోడీ పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలంటూ చెబుతున్నారు. పాలసీ ఫెయిల్యూర్, విదేశీ పెట్టుబడులు రాకపోవడం, మనదేశంలో ఉన్న పెట్టుబడులను ఫారెన్ కంపెనీలు వెనక్కి తీసుకోవడం వంటివి దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి. భారతదేశ ఆర్థిక పరిస్థితిని గత 12 ఏళ్లుగా మెరుగుపరచలేని మోడీ సర్కార్ పక్కదారులు వెతుకుతూ ధరలను పెంచుతోంది. మోడీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారు. పెట్రో ధరలను నానాటికీ పెంచుతూ జనాల జేబులను కొల్లగొడుతున్నారు.
నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న అదనపు సుంకాలను తగ్గించుకోవడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *