Breaking News

పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు

-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో భారీ ఏర్పాట్లు
-నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని మహానాడును విజయవంతం చేయాలి – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో సోమవారం ఈనెల 27, 28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, డివిజన్ నాయకులతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యకర్తలకు కల్పించాల్సిన సౌకర్యాలు, క్లస్టర్ స్థాయిలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి చెరగని ముద్ర వేసిందని పేర్కొన్నారు. భారతదేశ రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసిన అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సాధించారని గుర్తు చేశారు.

ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీలలో జరిగే మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు ఒక మహోత్సవంలాంటిదని ఆయన అన్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అందరూ ఒకే వేదికపై పార్టీ భవిష్యత్ దిశ, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే గొప్ప వేదిక మహానాడు అని పేర్కొన్నారు. మహానాడు అనేది కేవలం సమావేశం మాత్రమే కాకుండా పార్టీ కుటుంబానికి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించే కార్యక్రమమని అన్నారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పెట్రోల్ – డీజిల్ సరఫరా పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మహానాడును క్లస్టర్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడు కార్యక్రమాన్ని వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో అగ్రనాయకత్వం సమక్షంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో జూమ్ యాప్, ఆధునిక ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 11 క్లస్టర్లు ఉన్నాయని, ప్రతి క్లస్టర్ పరిధిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం 2.75 లక్షల మందికి పైగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 21 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్, కూర్చునే ఏర్పాట్లు, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తూ మహానాడు కార్యక్రమం జరుగుతున్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సెంట్రల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మహానాడు నిర్వహించనున్న కేంద్రాలను కూడా బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సింగ్‌నగర్ షాదీఖానా, LBS నగర్ వంగవీటి మోహనరంగా కళ్యాణ మండపం, గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం, కందుకూరి కళ్యాణ మండపం, గోకరాజు గంగరాజు క్షత్రియ భవన్, వాసవి కన్యకాపరమేశ్వరి మండపం, IV ప్యాలెస్, విజయ మేరీ, మధురానగర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ – చంద్రబాబు నాయుడు ని అభిమానించే ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో మహానాడు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ పార్టీ శక్తిసామర్థ్యాలను మరోసారి చాటిచెప్పాలని ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *