తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జరిగిన సమీక్షలో వర్చువల్ గా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ డెస్క్ విధానంలో మార్చి,2026 నుండి 1681 పరిశ్రమలకు గాను 1641 అనుమతులు ఇచ్చామని మరో 40 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 8 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ. 64.14 లక్షలు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 8 యూనిట్లకు ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి, కలంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి, నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపారని తెలిపారు.
పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపిఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశలలో వున్నాయని,ఇంకా ప్రారంభించని వాటిని త్వరిత గతిన ప్రారంభించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి విజయ భరత్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణ రెడ్డి, ఆర్ టి ఓ మురళి మోహన్, కార్మిక శాఖ అధికారి చిన్న లాలప్ప. స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, లోకనాధం, సంబంధిత జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News