-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, TUDA పరిధిలో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. నగర అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు తదితర సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని APIIC అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్దేశిత గడువుల్లో పరిష్కరించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా శాఖల అధికారులు స్పందనాత్మకంగా పనిచేయాలన్నారు
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఇంచార్జి మునిసిపల్ కమీషనర్ శారదా దేవి, పంచాయతీ అధికారి సుశీలా దేవి, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, APIIC జోన్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి, డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, ఎస్ ఈ ఆర్ అండ్ బి రాజా నాయక్, సివిల్ సప్లై అధికారి రాజు, ఇరిగేషన్ డి ఈ, రాధా కృష్ణా , గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, ఉద్యాన శాఖ అధికారి శివకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు. సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News