Breaking News

ఎంఎస్ఎంఈతో ఏపీలో పారిశ్రామిక విప్ల‌వం

– ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ 2026లో మంత్రి కొండ‌ప‌ల్లి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంఎస్ఎంఈతో ఏపీలో స‌రికొత్త ఔత్సాహిక‌, స‌రికొత్త పారిశ్రామిక విప్ల‌వానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాంది ప‌లికార‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య అతిథిగా ఎంఎస్ఎంఈ గ్రోత్ స‌మ్మిట్ 2026 కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొండ‌ప‌ల్లి మాట్లాడుతూ 1995 – 2004 మ‌ధ్య ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌తో త‌న లాంటి ఎంతోమంది ఐటీ రంగంలో ఉన్న‌త‌స్థానాల్లోకి ఎదిగే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీని పారిశ్రామికంగా ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్య‌మంత్రి ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా ప‌రుగులు పెట్టిస్తున్నార‌ని మంత్రి కొనియాడారు. గ‌త ప్ర‌భుత్వం పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వెళ్లగొట్ట‌డ‌మే త‌ప్పా ఏ ఒక్క‌రిని రాష్ట్రంలోకి రానివ్వ‌లేదు… పెట్టుబ‌డులు పెట్ట‌నీయ‌లేద‌ని మంత్రి విమ‌ర్శించారు. ప్ర‌తి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త ఉంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తిరుగుండ‌ద‌న్న ఆలోచ‌న‌తోనే ముఖ్య‌మంత్రి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని మంత్రి తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 19 పార్కులు ప్రారంభ‌మ‌వ్వ‌గా.. సోమ‌వారం 38 పార్కుల‌ కు ముఖ్య‌మంత్రి వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేయటం రాష్ట్రంలో పారిశ్రామిక విప్ల‌వానికి నాందిగా అభివ‌ర్ణించారు. క్ల‌స్ట‌ర్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం కింద సీఎం గారు రు. 200 కోట్ల‌ను విడుద‌ల చేస్తున్నార‌ని.. అలాగే సెక్టార్ బేస్‌డ్ ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్స్‌లో కామ‌న్ పెసిలిటీస్ క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. 2 సంవ‌త్స‌రాల్లో ఎంఎస్ఎంఈల‌కు 2,11,894 కోట్ల రుణాలు ఇచ్చిన ఘ‌న‌త కూట‌మి ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని మంత్రి కొనియాడారు. ప్ర‌ధాన‌మంత్రి ముద్ర‌యోజ‌నా ప‌థ‌కం కింద రు. 39,941 కోట్ల రుణ సౌక‌ర్యం క‌ల్పించామ‌న్నారు. పీఎంఎఫ్ఎం ఈ కింద స‌బ్సిడీతో 3387 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించేలా చేశామ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం 28,758 కొత్త వ్యాపారాలు స్టాండ‌ప్ ఇండియా కింద స్థాపించ‌బ‌డ్డాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టామ‌ని.. రాష్ట్రంలో ఉన్న 20.77 ల‌క్ష‌ల ఎంఎస్ఎంఈల్లో చాలా మంది రుణాలు దొర‌క‌క ఇబ్బందులు ప‌డుతోన్న నేప‌థ్యంలో ఏపీ ఎస్ఎంఈ ఎక్సేంజ్ ఏర్పాటు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ క‌మిటీని కూడా నియ‌మించామ‌ని మంత్రి తెలిపారు. స్వ‌ర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్ర‌తి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్త ఉండాల‌న్న నినాదంలో ప్ర‌తి ఒక్క‌రు ముందడుగు వేయాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *