– చెట్లను పెంచుతూ భవిష్యత్తుకు రక్షణగా నిలుద్దాం
– ప్రతి పరిశ్రమ ఆవరణలో 33 శాతం హరిత హారం తప్పనిసరి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనమే మారి.. మన భూమిని కాపాడుకుందామని.. పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరముందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లను పెంచండి.. భవిష్యత్తును కాపాడండి.. అనే సందేశంతో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 శాతం హరిత విస్తీర్ణం లక్ష్యంగా కృషిచేయాలని.. అదేవిధంగా పరిశ్రమల ఆవరణల్లో ఈ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలన్నారు. చెట్లను పెంచడంతో పాటు నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలుచేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని.. వర్షపు నీటి సంరక్షణ కూడా చాలా ముఖ్యమన్నారు. హరిత పట్టణాల అభివృద్ధికి గ్రీన్ బిల్డింగ్స్, ప్రజా రవాణా వినియోగం, సైక్లింగ్‌కు ప్రోత్సాహం వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు. పర్యావరణ అనుకూల వస్తువులను వినియోగించాలని, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, ఇంధన పొదుపును రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎండీ నజీనా బేగం, గనుల శాఖ డీడీ శ్రీనివాస కుమార్, ఏడీ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News