-వ్యాధుల భారాన్ని తగ్గించడంలో ‘ఏఐ’దే కీలకపాత్ర!
-వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనలోనూ తోడ్పాటు।
-మెడ్ టెక్ ఛాలెంజ్ ద్వారా ‘లైట్ హౌస్’గా నిలిచిన ఏపీ
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
-‘ఆరోగ్య వ్యవస్థ-ఏఐ ఆధారిత సేవలు ‘ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే తొలిసారిగా ‘మెడ్ టెక్ ఛాలెంజ్’ విధానంలో వైద్య సేవల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ‘లైట్ హౌస్’ స్టేట్ గా నిలిచిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఏఐ వినియోగంతో నిర్వహించే వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని, తద్వారా ఉన్నత వైద్యాన్ని వైద్యులు వెంటనే సదరు రోగులకు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏఐ వాడకంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తక్కువ వ్యయమవుతుందని, దీనివల్ల సదరు కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు రోగులు త్వరగా అనారోగ్యాల నుంచి కోలుకోవడంవల్ల సదరు కుటుంబాల వారికి స్వాంతన చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 రకాల వ్యాధుల భారాన్ని (అసంక్రమిత వ్యాధులు) ఏఐ ఆధారిత సేవల ద్వారా తగ్గించవచ్చునని తెలిపారు. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు దూరదృష్టితో రాబోతున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనావేస్తూ అన్ని రంగాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే.. వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కల త్వరగా సాకారామవుతుందన్నారు. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖలో మెడ్ టెక్ ఛాలెంజ్ ద్వారా రోగులకు అంకుర సంస్థలు వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేశాయని తెలిపారు.
తక్కువ వ్యయంతో ఉత్తమ వైద్య సేవలు అందేలా అంకుర సంస్థలు ముందుకు రావాలి!
మెడ్ టెక్ ఛాలెంజ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 అంకుర సంస్థలు తమ రకరకాల ఎంక్వెప్మెంట్స్ ద్వారా ఆసుపత్రుల్లో రోగులకు ఈ మధ్య వైద్య సేవలు అందించాయి. వీటిలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన అంకుర సంస్థలకు మంత్రి నగదు అందచేశారు. వాటికి ప్రశంస పత్రాలు కూడా ఇచ్చారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం ఆరోగ్య వ్యవస్థలో ఏఐ సేవల సదస్సు ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీ సత్యకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐ వినియోగం ద్వారా వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పుల రానున్నాయని తెలిపారు. అయితే ఇందుకు తగ్గట్లు పటిష్టమైన కార్యాచరణ ఉండాలన్నారు. తక్కువ వ్యయంతో ఉత్తమ వైద్యాన్ని అందించేందుకు ఆంకుర సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత వైకాపా పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఆసుపత్రులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నందున ఓపీ సేవల్లో 20% పెరుగుదల కనిపిoచిందన్నారు. ఐపీ, డయాగ్నస్టిక్ పరీక్షలు అనూహ్యoగా పెరిగినట్లు తెలిపారు. అభా ఖాతాల నమోదులో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉందని వెల్లడించారు. స్వస్తి ది హెల్త్ కేటలిస్టు సంస్థ వ్యవస్థాపకులు శివ్ కుమార్ మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక వ్యవస్థలను అందిపుచ్చుకోవడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఇందుకు తగిన వాతావరణం రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ ఆథారిటీ (ఎన్ హెచ్ ఏ ) జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదరి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నగదు ప్రోత్సాహాకాల పంపిణీ!
మెడ్ టెక్ ఛాలెంజ్ కింద 18 ఆసుపత్రుల్లో 4 కేటగిరిల్లో 18 అంకుర సంస్థలు పైలట్ ప్రాజెక్టు కింద రోగులకు సేవలు అందించాయి. ఒక్కొక్క కేటగిరిలో ప్రధమ స్థానంలో (విన్నర్) వచ్చిన సంస్థలకు మంత్రి నగదు ప్రోత్సాహాకాన్ని అందించారు. ఏఐ పవర్డ్ డయాగ్నస్టిక్స్ కేటగిరి- సొలిసిట్ టెక్నాలజీస్, పోర్టబు ల్ పాయింట్ ఆఫ్ కేర్ డివైజస్ కేటగిరి-రెమిడియో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, స్మార్ట్ మానిటరింగ్ అండ్ వెరియబుల్స్ కేటగిరి-కేర్ ఎన్ ఎక్స్ ఇన్నోవేషన్స్, రిమోట్ మానిటరింగ్ కేటగిరి-రీజువిన్ మెడికేర్ ఇండియాలు తొలి స్థానంలో వచ్చాయి. ఈ నాలుగు కేటగిరిల్లోనే మొదటి రన్నర్ అప్, రెండో రన్నర్ అప్ కలిపి మొత్తం 8 సంస్థల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ వెల్లడించారు. అంకుర సంస్థలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆసుపత్రుల్లో రోగులకు అందించిన సేవల వివరాలను ప్రత్యేక కమిటీ ముందు ప్రదర్శించాయి. వీటిని ‘క్యాథ్’ కమిటీ (కమిటీ ఫర్ అప్లయిడ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్) పరిశీలించి విన్నర్, రన్నర్ అప్ కింద సదరు కంపెనీలను ఎంపికచేశాయి.
Prajavartha Online Telugu News